Political Heat: దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు వడదెబ్బకు గురవుతున్నారు. రాజకీయ సెగలు కంటే.. భానుడి సెగలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఎన్నికల్లో ప్రతిక్షణం విలువైనది కావడంతో ఎండను సైతం వారు లెక్కచేయడం లేదు. నామినేషన్లు, ప్రచారాలు, ర్యాలీలతో బిజీగా ఉన్నారు. మరోవైపు తీక్షణమైన ఎండతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. 2014, 2019 ఎన్నికల ప్రక్రియ ఏప్రిల్ రెండో వారానికి పూర్తయింది. దీంతో అప్పట్లో నాయకులు ఊపిరి పీల్చుకున్నారు. అప్పట్లో ఎండలు పెద్దగా ఎఫెక్ట్ చూపలేదు. కానీ ఇప్పుడు 48 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో నేతలకు వడదెబ్బ, ఉక్కపోత తప్పడం లేదు. ఏడు దశల్లో జరుగుతున్న ఈ ఎన్నికలు నాయకులకు, పార్టీ శ్రేణులకు పరీక్ష పెడుతున్నాయి.
తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మే 13న పోలింగ్ జరగనుంది. మీ 11 వరకు ప్రచారానికి అవకాశం ఉంది. అప్పటివరకు పార్టీలకు ఎండ తీవ్రత తప్పదు. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల కొలిమి నెలకొంది. ఉదయం 8 గంటల నుంచి భానుడు నిప్పులు కక్కుతున్నాడు. సాధారణంగా ఇంటి నుంచి బయటకు వచ్చేందుకే ప్రజలు ఇష్టపడటం లేదు. దీంతో ఇది ప్రచారంపై ప్రభావం చూపుతోంది. కార్యకర్తలు ముఖం చాటేస్తున్నారు. వచ్చినవారు రోడ్డు ఎక్కాలంటే ఇష్టపడడం లేదు. కొందరైతే వచ్చినట్టే వచ్చి జారుకుంటున్నారు.
ప్రస్తుతం ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే ఎన్నికల ప్రచారం సాగుతోంది. మధ్యాహ్న సమయంలో ఆన్లైన్ ప్రచారానికి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. అన్ని పార్టీల్లోనూ ఇదే కనిపిస్తోంది. కొందరు నాయకులైయితే తెల్లవారుజామున 5 గంటల నుంచి నాలుగు రోడ్ల జంక్షన్ లలో, టీ దుకాణాల వద్ద ప్రచారం చేయడం కనిపిస్తోంది. మరోవైపు సాయంత్రం 6 గంటల తర్వాత రాజకీయ దూకుడు కనిపిస్తోంది. ఎక్కువమంది సాయంత్రం ప్రచారానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే ఒకే సమయంలో అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారం చేస్తుండడంతో.. కొందరికి మీడియా ప్రాధాన్యత దక్కుతోంది. అయితే గతంలో ముందుగానే ఎన్నికలు జరిగేవని.. ఈసారి మాత్రం ఎండల దెబ్బకు ఇబ్బంది పడుతున్నామని నాయకులు చెబుతున్నారు.