Vallabhaneni Vamsi: విజయవాడ : వైసిపి ఫైర్ బ్రాండ్లపై దృష్టి పెట్టింది కూటమి ప్రభుత్వం. వైసిపి హయాంలో రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకు పడడంలో ఫైర్ బ్రాండ్లు ముందుండేవారు. పార్టీ విధానపరమైన నిర్ణయాలపై కాకుండా రాజకీయ ప్రత్యర్థుల పై వ్యక్తిగత దాడికి వీరు ప్రాధాన్యం ఇచ్చేవారు. అటువంటి వారు ఇప్పుడు ప్రభుత్వం మారడంతో టార్గెట్ అవుతున్నారు. తగిన మూల్యం చెల్లించుకుంటున్నారు. చంద్రబాబుతో పాటు లోకేష్ పై విరుచుకు పడడంలో కొడాలి నాని, వల్లభనేని వంశీ ఈ రేంజ్ లో ముందుండేవారు తెలియంది కాదు. చివరకు చంద్రబాబు సతీమణిని నిండు సభలో అవమానించి.. ఆయన రోధించేందుకు కారణమయ్యారు. లోకేష్ పై వ్యక్తిగత హననానికి దిగేవారు. కానీ ఆ ఇద్దరూ ఇప్పుడు మీడియాకు సైతం దొరకకపోవడం విశేషం.
వైసీపీ దారుణ పరాజయం తర్వాత కొడాలి నాని మీడియా ముందుకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. తన వాయిస్ తగ్గినా.. విమర్శలు మాత్రం తగ్గించలేదు. అయితే వల్లభనేని వంశీ జాడ మాత్రం ఇంతవరకు కనిపించలేదు. ఆయన హైదరాబాదులో ఉన్నారా? విజయవాడలో ఉన్నారా? దేశం దాటి వెళ్లిపోయారా? అన్నది మాత్రం తెలియడం లేదు. అటు గన్నవరంలో సైతం వైసీపీ కార్యాలయాన్ని క్లోజ్ చేశారు. కనీసం ఓటమిపై సమీక్ష కూడా జరపలేదు. దీంతో రకరకాల ప్రచారం నడుస్తోంది. ఆయన అమెరికా వెళ్లిపోయాడని టాక్ నడుస్తోంది. ఎన్నికలు జరిగిన తరువాత వల్లభనేని వంశీ అమెరికా వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఆయన అక్కడే ఉండిపోతారని కూడా ప్రచారం జరిగింది. కానీ ఫలితాల సమయానికి ఏపీకి వచ్చారు. తరువాత కనుమరుగయ్యారు. ఎక్కడున్నారో కూడా తెలియడం లేదు.
వల్లభనేని వంశీని టార్గెట్ చేశారు పోలీసులు. గన్నవరం డిఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన కొత్త వ్యక్తి పాత కేసును తెరపైకి తెచ్చారు. గన్నవరం టిడిపి కార్యాలయం పై జరిగిన దాడి కేసును రీఓపెన్ చేశారు. అప్పటి సీసీ పూటేజిని పరిశీలించారు. గన్నవరం వైసీపీ కార్యాలయంలో ఉండి.. వల్లభనేని వంశీ ఈ ఘటనకు పాల్పడ్డారని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అందుకే ఇప్పుడు వంశీ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. అప్పట్లో ఆ కేసుకు సంబంధించి అసలు నిందితులను వదిలేశారు. టిడిపి నేత పట్టాభిరామ్ తో పాటు మరికొందరిని అరెస్టు చేశారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది. పోలీసుల వ్యవహార శైలి కూడా మారింది. కొత్త డిఎస్పి సీసీటీవీ ఫుటేజ్, మీడియాలో వచ్చిన వీడియోలు చూసి 15 మందిని అరెస్టు చేశారు. ఇందులో వంశీ కారు డ్రైవర్ కూడా ఉన్నారు. దీంతో తరువాత అరెస్ట్ వల్లభనేని వంశీ దేనని తెలుస్తోంది. కానీ ఆయన జాడ ఇంతవరకు తెలియకపోవడం విశేషం. ఆయన విదేశాలకు వెళ్లిపోతే పర్వాలేదు.. విజయవాడలో ఉంటే మాత్రం అసలు సినిమా చూపించే అవకాశం ఉంది.