Kodali Naani : వైసీపీ ఫైర్ బ్రాండ్లలో కొడాలి నాని ఒకరు. గత ఐదేళ్లుగా నాని ఏ స్థాయిలో విరుచుకుపడేవారు ఏపీలో తెలియని వారు ఉండరు. చంద్రబాబుతో పాటు లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసేవారు. తీవ్ర స్థాయిలో మండిపడేవారు. తనపై గెలిచి చూడాలని సవాల్ చేసేవారు. తాను గుడివాడలో ఓడిపోతే చంద్రబాబుకు గులాం గిరి చేస్తానని కూడా చెప్పుకొచ్చేవారు. ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబుపై వ్యక్తిగత కామెంట్లు చేయడంలో ముందంజలో ఉండేవారు. అందుకే కొడాలి నాని పై టిడిపి శ్రేణులకు ఒక రకమైన అభిప్రాయం ఉండిపోయింది.కూటమి అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతున్నా ఆయన అరెస్టు జరగకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు నమోదవుతున్నాయి. అరెస్టుల పర్వం కూడా కొనసాగుతోంది. ఇదే క్రమంలో గతంలో కొడాలి నాని అనుచిత కామెంట్స్ పై సైతం రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కానీ ఆయన అరెస్టు మాత్రం జరగడం లేదు. అయితే ఆయనపై పటిష్టమైన కేసులు పెట్టి.. అరెస్టు చేయాలన్న ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. ఈ తరుణంలో ఆయన సొంత నియోజకవర్గ గుడివాడలోనే తాజాగా కేసులు నమోదవుతున్నాయి. ఈ కేసుల్లో కొడాలి నాని అరెస్టు తప్పదని ప్రచారం నడుస్తోంది.
* జగనన్న కాలనీల పేరుతో
గుడివాడలో గత ప్రభుత్వ హయాంలో జగనన్న కాలనీల నిర్మాణానికి 173 ఎకరాలను సేకరించారు. మెరక పేరుతో అనుచరులకు వర్క్ ఆర్డర్స్ ఇచ్చారన్నది నాని మీద ఉన్న ఆరోపణలు. అలా వారికి పనులు అప్పగించి 40 కోట్ల రూపాయల వరకు స్వాహా చేసినట్లు నాని పై ఫిర్యాదులు వచ్చాయి. ఇప్పటికే ఈ వ్యవహారంపై విజిలెన్స్ విచారణ జరిగింది. ఏపీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. దీంతో కూటమి సర్కార్ సీరియస్ యాక్షన్ కు దిగే అవకాశం ఉంది. జగనన్న కాలనీల కోసం గుడివాడ నియోజకవర్గం మల్లయ్యపాలెంలో 178 ఎకరాలు సేకరించారు. ఎకరా భూమిని 52 లక్షలకు కొన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ చదును చేయడం కోసం అనుచరులకు పెద్ద ఎత్తున వర్క్ ఆర్డర్లు ఇచ్చినట్లు ఫిర్యాదులు ఉండేవి. అయితే ఈ పనులన్నింటినీ కొడాలి నాని బినామీలే చేశారన్నది ప్రధాన ఆరోపణ.
* అందుకే మౌనమా
అయితే గత కొంతకాలంగా కొడాలి నాని మౌనంగా ఉన్నారు. కేవలం ఈ కేసు విషయంలో తన అరెస్టు తప్పదని తెలిసి భయపడి మాట్లాడడం లేదని ప్రచారం నడుస్తోంది. అదే సమయంలో పార్టీ కార్యక్రమాలకు సైతం కొడాలి నాని హాజరు కావడం లేదు. మరోవైపు ఆయన స్నేహితుడు, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ పై కూడా ఇటువంటి కేసులే ఉన్నాయి. తన బినామీల పేరిట పోలవరం గట్టు తవ్వి మట్టి తవ్వకాలు చేశారన్నది ప్రధాన ఆరోపణ. ఆయన ఓ 100 కోట్ల రూపాయల వరకు లూటీ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఈ ఇద్దరు నేతల విషయంలో కూటమి సీరియస్ గా ఉందట. అది తెలిసి ఇద్దరు నేతలు తెగ భయపడుతున్నారట.