Kadapa MP Avinash Reddy : కడప ఎంపీ అవినాష్ రెడ్డి పేరు ఇప్పుడు తెరపైకి వస్తోంది. ఆయన చుట్టూ ఉచ్చు బిగుసుకునే అవకాశం ఉంది.ఇప్పటికే వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాజాగా సోషల్ మీడియా పోస్టుల్లో సైతం అవినాష్ రెడ్డి ప్రమేయం ఉందని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.ఈ కేసులో నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా అవినాష్ రెడ్డి పిఎ రాఘవరెడ్డిని అరెస్టు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపడుతున్నారు.సరిగ్గా ఇదే సమయంలో వైఎస్ సునీత తాజా ఫిర్యాదుతో అవినాష్ పై చర్యలకు ఉపక్రమించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే కేసు విచారణలో రవీందర్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం సంచలనం రేపుతోంది. వైయస్ విజయమ్మ,షర్మిల, సునీత పై పెట్టిన పోస్టుల వెనుక అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి హస్తం ఉందని.. ఆయన ఇచ్చిన కంటెంట్ తోనే తాను పోస్టులు పెట్టానని రవీందర్ రెడ్డి విచారణలో ఒప్పుకున్నారు. దీంతో రాఘవరెడ్డిని అరెస్టు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపడుతున్నారు.
* ప్రాథమిక నిర్ధారణకు పోలీసులు
కడప ఎంపీ అవినాష్ రెడ్డి సూచనలతోనే రాఘవరెడ్డి పోస్టులు పెట్టారని,రవీందర్ రెడ్డికి కంటెంట్ ఇచ్చారని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.రాఘవరెడ్డి అరెస్టు తరువాత..అవినాష్ రెడ్డిని పోలీసులు విచారించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈ పోస్టుల విషయంలో షర్మిల తో పాటు సునీత తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.అందుకే తాము చర్యలు తీసుకోలేకపోయామని ఏపీ పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సునీత ఏపీ పోలీసులకు నేరుగా ఫిర్యాదు చేయడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నారు.
* సునీత సన్నాహాలు
కడప జిల్లా పులివెందులలో నేరుగా అవినాష్ పై ఫిర్యాదు చేయడానికి సునీత నిర్ణయం తీసుకున్నారు. ఏ విధంగా కేసు పెట్టాలని అంశంపై న్యాయ నిపుణుల సలహా తీసుకున్నారు. అవినాష్ రెడ్డి ప్రమేయాన్ని నిర్ధారించే ఆధారాలను పోలీసులకు అందించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఒకవైపు పీఏ రాఘవరెడ్డి అరెస్ట్, ఇంకోవైపు సునీత ఫిర్యాదుతో అవినాష్ రెడ్డిని అష్టదిగ్బంధనం చేసేందుకు ఏపీ పోలీసులు ప్రయత్నిస్తున్నారు.సునీత ఇచ్చే ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు, ఆధారాలు ఇప్పుడు కీలకంగా మారనున్నాయి.