https://oktelugu.com/

Social Media : పిచ్చి రాతలు రాస్తే చేటే.. ‘సోషల్’ హద్దులు లేకుంటే మూల్యం తప్పదు!

సోషల్ మీడియా ఒక వజ్రాయుధం.. మనలో ఉన్న భావాన్ని స్వేచ్ఛగా వ్యక్తపరచడానికి ఉన్న ఒక సాధనం. కానీ దానిని కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. సమాజ విఘాతానికి ఉపయోగిస్తున్నారు.

Written By: Dharma, Updated On : November 14, 2024 11:06 am

Social Media

Follow us on

Social Media :  ఇప్పుడు ఏపీలో సోషల్ మీడియా పేరు చెబితే నెటిజెన్లు హడలెత్తిపోతున్నారు. పోస్టులు పెట్టినప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటున్నారు. గత కొద్దిరోజులుగా వైసిపి సోషల్ మీడియా ప్రతినిధుల అరెస్టు పర్వం కొనసాగుతోంది. మరోవైపు పెద్ద ఎత్తున కేసులు నమోదు అవుతున్నాయి. ఈ క్రమంలో సోషల్ మీడియా పై బలమైన చర్చ ప్రారంభమైంది. ఒక విధంగా చెప్పాలంటే సోషల్ మీడియా అంటేనే చాలామందికి వెన్నులో వణుకు పుడుతోంది. డిప్యూటీ సీఎం పవన్ ఫైర్ అయిన మరుక్షణం నుంచి ఏపీ రాజకీయాల్లో కొత్త మార్పు కనిపిస్తోంది. వారు వీరు అన్న తేడా లేకుండా సోషల్ మీడియాలో భావ ప్రకటన స్వేచ్ఛ కింద తప్పుడు రాతలు రాస్తే పోలీసులు కఠిన చర్యలకు దిగుతున్నారు. సోషల్ మీడియాలో చేసే ప్రతి పోస్టు, రాసే ప్రతి మాటను గమనించే త్రినేత్రం ఒకటి ఉంటుంది. సోషల్ మీడియా యూజర్లు ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాల్సిన విషయం ఇదే. హద్దుల్లో లేకపోతే ప్రమాదంలో పడినట్టే. విమర్శలు చేయడంలో తప్పులేదు కానీ హద్దులు దాటి వ్యవహరిస్తే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు కోరి తెచ్చుకున్నట్టే.

* మారిన చట్టాలు
సైబర్ నేరాలకు సంబంధించి చట్టాలు మారాయి. సెక్షన్లు మరింత కఠిన తరంగా మారాయి. గతంలో 41ఏ నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకునేవారు. ఇకనుంచి అలా ఉంటాం అంటే కుదరదు. కఠిన శిక్షలు, సెక్షన్లు అమల్లోకి వచ్చాయి. ఒకసారి అరెస్టు జరిగితే జైలులో మగ్గాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా చూసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాలి. ఎప్పుడు పోస్ట్ పెట్టారు అన్నది కాదు.. తప్పుగా పెట్టరా లేదా అన్నట్టు వెతికి మరి పట్టుకుంటున్నారు ఏపీ పోలీసులు.

* ఒక మంచి వేదిక
భావ ప్రకటన స్వేచ్ఛకు సోషల్ మీడియా ఒక వేదిక. దానిని ఎలా ఉపయోగించుకుంటే అలా ఉపయోగపడుతుంది. దుర్వినియోగం చేస్తే అంతలా దుర్వినియోగం అవుతుంది. గత ఐదేళ్ల వైసిపి పాలనలో ఎక్కువగా దుర్వినియోగం అయింది. పార్టీ కోసం, ఓ వ్యక్తి కోసం ఉపయోగపడింది. కానీ సమాజానికి మాత్రం చేటు తెచ్చింది. కొందరిపై వ్యక్తిత్వ హననానికి కారణమయ్యింది. ఒకటి మాత్రం నిజం సోషల్ మీడియా పై బలమైన చర్చ మాత్రం ప్రారంభమైంది. కనీసం కేసుల భయంతోనైనా సోషల్ మీడియాలో మార్పు వస్తే.. అది ఆహ్వానించదగ్గ పరిణామం.