PM Modi greater vision: తెలంగాణలో పర్యటించారు ప్రధాని నరేంద్ర మోడీ. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు పదివేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభ జరిగింది. అదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డితో సైతం సన్నిహితంగా మెలిగారు ప్రధాని. ఒక విధంగా చెప్పాలంటే పక్క పొలిటికల్ వ్యూహంతోనే సాగింది నరేంద్ర మోడీ పర్యటన. అయితే మరోవైపు హైదరాబాదులో ఉంటున్న ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులతో గడిపారు మోదీ. అయితే దీని వెనుక గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల వ్యూహం ఉన్నట్టు అర్థం అవుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనలను గమనిస్తే ఒక వ్యూహం ప్రకారమే సాగుతుంటాయి. ఇప్పుడు చంద్రబాబుతో పాటు పవన్ విషయంలో కూడా ప్రధాని ఆలోచన అదేనని ఒక టాక్ నడుస్తోంది.
గ్రేటర్ ఎన్నికలు త్వరలో..
మరి కొద్ది రోజుల్లో గ్రేటర్ ఎన్నికలు జరగనున్నాయి. భారతీయ జనతా పార్టీ వీటిని ఒక సెమీఫైనల్స్ గా భావిస్తున్నాయి. అందుకే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గత ఎన్నికల్లో సైతం ఇక్కడ మంచి ఫలితాలు సాధించింది.. అందుకే ఈసారి మేయర్ పీఠం సాధించడం ద్వారా తెలంగాణలో తామే ప్రత్యామ్నాయం అన్నట్టు సంకేతాలు పంపాలని చూస్తోంది. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ స్వయంగా రంగంలోకి దిగారు. చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ ఇళ్లకు వెళ్లి.. టిడిపి తో పాటు జనసేన మద్దతును పరోక్షంగా పొందినట్టు అర్థం అవుతోంది.
టిడిపికి బలమైన క్యాడర్..
గ్రేటర్ పరిధిలో టిడిపికి క్యాడర్ ఉంది. ఒక బలమైన సామాజిక వర్గం దన్ను ఉంది. ఆ రెండింటిని తిప్పుకుంటే బీజేపీకి ఇక్కడ ప్లస్ పాయింట్ అవుతుంది. పైగా పవన్ కళ్యాణ్ ఇమేజ్ కూడా గ్రేటర్ పరిధిలో ఎక్కువ. ఏపీలో ప్రధాన భాగస్వామ్య పక్షాలుగా ఉండడంతో సెటిలర్స్ తప్పకుండా బిజెపి వైపు మొగ్గు చూపుతారని అంచనాలు ఉన్నాయి. అయితే ఆ ఇద్దరు నేతలను కలవడం ద్వారా సరికొత్త సంకేతాలను పంపించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి పోటీకి దూరంగా ఉండిపోయింది. అది అంతిమంగా కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూర్చిందని విశ్లేషణలు ఉన్నాయి. ఒకవేళ గ్రేటర్ ఎన్నికల పరిధిలో టిడిపి ఓటు బ్యాంకును బిజెపి వైపు మళ్లించగలిగితే.. భారతీయ జనతా పార్టీ గెలుపు నల్లేరు మీద నడక కానుంది. ఆ ఉద్దేశంతోనే చంద్రబాబు ఇంటికి వెళ్లిన మోడీ గంటా పది నిమిషాల పాటు ఆయన కుటుంబ సభ్యులతో గడిపారు.
పవన్ ఇమేజ్..
పవన్ కళ్యాణ్ బిజెపికి సానుకూలంగా ఉంటారు. మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లోనే బీజేపీతో కలిసి పోటీ చేశారు కొన్నిచోట్ల. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపితో పొత్తు పెట్టుకున్నారు. తెలంగాణ కంటే గ్రేటర్ పరిధిలో పవన్ కళ్యాణ్ అభిమానులు ఎక్కువ. అందుకే వారిని మచ్చిక చేసుకోవడానికి ప్రధాని నరేంద్ర మోడీ పరామర్శ పేరుతో పవన్ ఇంటికి వెళ్లారు అనేది పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తున్న మాట. మొత్తానికి అయితే ప్రధాని టూర్ వెనుక గట్టి వ్యూహమే ఉన్నట్టు స్పష్టమైంది.