TDP Alliance: టిడిపి( Telugu Desam Party) కూటమి ప్రభుత్వం చెప్పుకునేందుకు చాలా అంశాలు ఏపీలో ఉన్నాయి. కూటమి అధికారంలోకి వచ్చి 18 నెలలు దాటుతోంది. అయితే ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం స్పష్టంగా కనిపిస్తోంది. ఉత్తరాంధ్రకు వెళితే ఐటీ హబ్, ఐటీ పరిశ్రమల ఏర్పాటు నిరంతర ప్రక్రియ గా కొనసాగుతోంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం సైతం తుది దశకు వచ్చింది. అమరావతి రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. మరో రెండేళ్లలో ఒక కొలిక్కి రానున్నాయి. మరోవైపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సైతం అదే స్థాయిలో ముందుకు సాగుతోంది. రాయలసీమలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు కానుంది. పెద్దఎత్తున తయారీ పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయి. టిడిపి కూటమి చెప్పుకునేందుకు సరైన అంశాలు ఇవి.
* అప్పుడు కేవలం సంక్షేమమే..
ఏ ప్రభుత్వం అయినా ప్రజలకు మేలు చేయడమే అంతిమ లక్ష్యం. దానికిగాను ప్రభుత్వాలు వేర్వేరు మార్గాల్లో వెళ్తుంటాయి. వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress ) ప్రభుత్వం ఉన్నప్పుడు కేవలం సంక్షేమమే నడిచేది. చాలా రకాల సంక్షేమ పథకాలను రాజకీయాలకు అతీతంగా నడిపించారు జగన్మోహన్ రెడ్డి. అంతవరకు ఓకే కానీ.. అభివృద్ధి పరంగా మాత్రం ఎటువంటి ఫలితం కనిపించలేదు. అన్ని రకాల నిధులను సంక్షేమ పథకాలకు బదలాయించేవారు. కనీస స్థాయిలో ఇతర రంగాలకు కేటాయింపులు జరిగేవి కావు. నిధుల కొరతతో ప్రజలకు మౌలిక వసతులు సమకూరేవి కూడా కావు. ప్రజలు సంక్షేమ పథకాలను తీసుకున్నారు. కానీ అభివృద్ధిని ఆశించారు. అలా రెండింటిని సమప్రాధాన్యం ఇవ్వడంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యారు. దాని ఫలితాలు 2024 ఎన్నికల్లో చవిచూశారు.
* రెండింటికి సమ ప్రాధాన్యం..
నిజంగా టిడిపి కూటమి ప్రభుత్వానికి జగన్ ( Y S Jagan Mohan Reddy ) పాలన ఒక గుణపాఠం. అందుకే టిడిపి కూటమి ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం ముందుకు వెళ్తోంది. అమరావతి రాజధాని నిర్మాణం చేపడుతోంది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డికి అత్యంత మైనస్ రాజధాని అంశం. అమరావతిని తీవ్రంగా వ్యతిరేకించారు. మూడు రాజధానులు అన్నారు. వాటిని కూడా కార్యరూపం దాల్చనీయలేదు. ఉన్న అమరావతిని నిర్వీర్యం చేశారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారన్న విమర్శలు మూటగట్టుకున్నారు. అందుకే దానిని ప్రాధాన్యత అంశంగా తీసుకుని చంద్రబాబు సర్కార్ అమరావతి రాజధాని నిర్మాణాన్ని శరవేగంగా జరిపిస్తోంది. 2028 నాటికి అమరావతి అనేది ఒక కొలిక్కి రానుంది.
* ఎన్నికల్లో చెప్పుకునేందుకు..
ఉత్తరాంధ్రలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం( bhogapuram International Airport ) టిడిపి కూటమికి ప్లస్ పాయింట్ గా నిలవనుంది. ఎందుకంటే 2014లో అధికారంలోకి వచ్చిన టిడిపి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయాలని సంకల్పించింది. అయితే పనులు మొదలుపెట్టింది. ఇంతలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి సర్కార్ పూర్తిస్థాయిలో కృషిచేసి ఉంటే ఈపాటికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చేది. కానీ ఇప్పుడు దానిని పూర్తిచేసే బాధ్యత టిడిపి ప్రభుత్వం తీసుకుంది. రెండు రోజుల్లో విమానం ల్యాండింగ్ కానుంది. వేసవి నుంచి విమాన రాకపోకలు ప్రారంభం కానున్నాయి. ఇంకోవైపు పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి. అవి కూడా 2028 నాటికి కొలిక్కి వస్తాయి. అంటే కూటమి ప్రభుత్వం మేము ఇది చేశాం అని చెప్పుకోడానికి కీలకమైన ప్రాజెక్టులు కనిపిస్తున్నాయి. ఆపై ఆలస్యంగా ప్రారంభమైనా సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయి. ఇది ఎంత మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి నష్టమే. తప్పకుండా ప్రజలు బేరీజు వేసుకుంటారు.