Pithapuram Varma: ఏపీలో( Andhra Pradesh) రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకుంది తెలుగుదేశం కూటమి. అయితే ఎలాగైనా పై చేయి సాధించాలని చూస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. మరోవైపు మూడు పార్టీల మధ్య బంధం మరింతగా బలోపేతం అవుతోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే కూటమి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పవన్ కళ్యాణ్ కోసం తన సీటును వదులుకున్న పిఠాపురం వర్మకు రక్షణ కల్పించింది ఏపీ ప్రభుత్వం. ప్రస్తుతం వర్మ చట్టసభల్లో లేరు. కానీ ఆయనకు భద్రత కల్పించడం విశేషం. ప్రభుత్వం ఇద్దరు గన్మెన్లను కేటాయించడం కొత్త చర్చకు దారితీస్తోంది. త్వరలో వర్మకు ప్రమోషన్ ఖాయమని ప్రచారం జరుగుతోంది.
పవన్ కోసం త్యాగం..
గడిచిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్( deputy CM Pawan Kalyan ) కోసం టికెట్ వదులుకున్నారు వర్మ. పవన్ గెలుపు కోసం కృషి చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయనకు పదవి గ్యారెంటీ అని అంతా ప్రచారం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఎలాంటి పదవి దక్కలేదు. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ప్రచారం నడుస్తోంది. మరోవైపు పిఠాపురం నియోజకవర్గంలో వర్మకు ప్రాధాన్యం తగ్గుతోందని ఆయన అభిమానులు సైతం ఆవేదనతో ఉన్నారు. ఎమ్మెల్సీ పదవుల భర్తీ సమయంలో వర్మ పేరు ప్రముఖంగా వినిపించింది. కనీసం నామినేటెడ్ పదవి కూడా దక్కలేదు. ఈ క్రమంలో వర్మ పార్టీ మారుతారని కూడా ప్రచారం జరిగింది. కానీ అటువంటిదేమీ లేకుండా పోయింది. అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. తద్వారా వర్మకు త్వరలోనే పదవి లభించవచ్చు అని సంకేతాలు పంపగలిగింది.
ఇద్దరు గన్మెన్లు కేటాయింపు..
సాధారణంగా ఏదైనా చట్టసభల్లో ఉన్నవారికి గన్మెన్లు కేటాయించడం ఆనవాయితీగా వస్తోంది. లేకుంటే సంఘవిద్రోహశక్తుల హిట్ లిస్టులో ఉన్న వారికి సైతం ప్రభుత్వం రక్షణ కల్పిస్తుంది. అయితే ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే పిఠాపురం వర్మకు( Pithapuram Varma ) ప్రభుత్వం ఇద్దరు గన్మెన్లను కేటాయించడం చర్చకు దారితీస్తోంది. ఇటీవలే వారు విధుల్లో చేరారు కూడా. త్వరలో వర్మను ఎమ్మెల్సీగా చేసి మంత్రివర్గంలోకి తీసుకుంటారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పవన్ కళ్యాణ్ గెలుపులో వర్మ కీలకపాత్ర పోషించారు. అందుకే వర్మ విషయంలో పవన్ సైతం సానుకూలంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ మొన్న ఆ మధ్యన జరిగిన పరిణామాలు వర్మను అవమానించేలా ఉన్నాయి. దీనిపై పలుమార్లు వర్మ హై కమాండ్ కు తన ఆవేదన వ్యక్తపరిచారట. అందుకే వర్మకు సంతృప్తి పరిచే పదవి ఇవ్వడం.. అంతకంటే ముందే రక్షణ కల్పించడం చూస్తుంటే నిజమేనని తెలుస్తోంది. మరి వర్మ కు ఎలాంటి పదవి కేటాయిస్తారో చూడాలి.