Pithapuram Varma: ఏపీలో రాజకీయాలు( politics) ఆసక్తిగా మారుతున్నాయి. పార్టీలతో పాటు నేతల వ్యవహార శైలి హాట్ టాపిక్ అవుతోంది. ప్రధానంగా పిఠాపురం నియోజకవర్గం చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. అక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ ఆయన కోసం సీటు త్యాగం చేశారు వర్మ. ఎన్నికల్లో గెలుపు తర్వాత వర్మను అభినందించారు పవన్ కళ్యాణ్. అటు తరువాత క్రమేపి వర్మ ప్రాధాన్యం తగ్గుతూ వచ్చింది. ఆయనకు ఇచ్చిన పదవి హామీ కూడా కార్యరూపం దాల్చలేదు. పైగా పిఠాపురం నియోజకవర్గంలో జనసైనికులు పెద్దగా లెక్క చేయడం లేదు. దీంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు వర్మ. గెలిపించిన పవన్ తో పాటు టిడిపి అధినేత చంద్రబాబుపై అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.
* గట్టి పట్టున్న నేత పిఠాపురం( Pithapuram ) నియోజకవర్గంలో పట్టున్న నాయకుడు వర్మ. గతంలో టిడిపి టికెట్ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అటువంటి నేత 2024 ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గంలో పోటీకి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇంతలోనే అదే నియోజకవర్గం కావాలని కోరారు పవన్ కళ్యాణ్. చంద్రబాబు విన్నపం మేరకు ఆ సీటును త్యాగం చేశారు.వర్మ త్యాగం చేయడమే కాదు పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కృషి చేశారు. అయితే ఇప్పుడు అదే వర్మకు పవన్ గెలుపుతో ఎటువంటి సంబంధం లేదని అర్థం వచ్చేలా మాట్లాడారు మెగా బ్రదర్ నాగబాబు. జనసేన ప్లీనరీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ గెలుపులో ఎవరైనా ఉంటారు అనుకుంటే.. అది వారి కర్మేనంటూ వ్యాఖ్యానించారు నాగబాబు. అది వర్మను ఉద్దేశించి చేసిన కామెంట్ అని అందరికీ తెలుసు. కానీ అటు తరువాత వర్మ దానిపై స్పందించలేదు.
* నా ప్రజలే బలం అంటూ..
అయితే తాజాగా సోషల్ మీడియాలో( social media) ఒక పోస్ట్ పెట్టారు వర్మ. గతంలో సైతం ఇలానే పోస్ట్ పెట్టారు. అది పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. అయితే అది తాను పెట్టిన ట్వీట్ కాదని.. తన సోషల్ మీడియా అకౌంట్స్ చూసే ఓ ఏజెన్సీ ప్రతినిధులు పెట్టారని మాట మార్చారు. ఇప్పుడు మాత్రం వర్మ స్పష్టమైన పోస్ట్ పెట్టారు. ఇందులో ప్రజలే నా బలం అంటూ ఓ భారీ స్లోగన్ పెట్టారు. అదే పోస్టర్ పై చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్, ఇతర కూటమినేతల ఫోటోలు కూడా పెట్టారు. అయితే ఈ ట్వీట్ ద్వారా వర్మ జనసేనకు గట్టి కౌంటర్ ఇచ్చారనే చర్చ మాత్రం జరుగుతోంది. అంటే తనకు ప్రజల్లో ఇంకా బలం ఉందని.. తన బలం చెక్కుచెదరలేదని అర్థం వచ్చేలా కామెంట్ చేశారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
నా ప్రజలే నా బలం… pic.twitter.com/iC1GxI4CJt
— SVSN Varma (@SVSN_Varma) March 21, 2025