Chandrababu And Pawan: కార్యాలయాల్లో చంద్రబాబు, పవన్ ఫొటోలు

వాస్తవానికి పవన్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలన్నది జన సైనికుల అభిమతం. కాపు సామాజిక వర్గం కోరిక కూడా అదే. కానీ వాటన్నింటినీ అధిగమించుతూ.. చంద్రబాబు సీఎం కావడానికి పవన్ అహర్నిశలు శ్రమించారు.

Written By: Dharma, Updated On : June 15, 2024 5:06 pm

Chandrababu And Pawan

Follow us on

Chandrababu And Pawan: పవన్ కు రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యం ఇస్తోంది. కూటమి పార్టీల నుంచి సరైన గౌరవం అందుతోంది. కేంద్ర పెద్దల నుంచి రాష్ట్రస్థాయి వరకు దిగ్గజ నాయకులు పవన్ అంటే ఒక గౌరవభావంతో చూస్తున్నారు. సరైన సమయంలో ఏపీలో కూటమి విజయానికి పవన్ ఒక కారణం అయ్యారు. దేశంలో మరోసారి ఎన్డీఏ అధికారంలోకి రావడానికి ఏపీ కీలకంగా మారింది. దీంతో ప్రతి ఒక్కరిలోనూ పవన్ పేరు వినిపిస్తోంది. గతంలో టిడిపిలోనే పవన్ పాత్ర పై ఒక రకమైన అభిప్రాయం ఉండేది. కానీ ఈ ఎన్నికల్లో పవన్ అనుసరించిన వ్యూహానికి టిడిపి శ్రేణులు సైతం ఫిదా అయ్యారు. ఇటీవల ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలోనూ, ప్రమాణ స్వీకార మహోత్సవంలోనూ పవన్ వ్యవహార శైలితో.. ఆయనపై ప్రత్యేక గౌరవం ఏర్పడింది.

వాస్తవానికి పవన్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలన్నది జన సైనికుల అభిమతం. కాపు సామాజిక వర్గం కోరిక కూడా అదే. కానీ వాటన్నింటినీ అధిగమించుతూ.. చంద్రబాబు సీఎం కావడానికి పవన్ అహర్నిశలు శ్రమించారు. తన ఇమేజ్ ను పణంగా పెట్టారు. అందుకే ఇప్పుడు చంద్రబాబు సైతం పవన్ ఇమేజ్ కు ఎటువంటి భంగం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆయన కోరకుండానే డిప్యూటీ సీఎం పోస్టు ఇచ్చారు. ఆయన కోరకుండానే కీలకమైన గ్రామీణ అభివృద్ధి శాఖను అప్పగించారు. ఒకరకంగా చెప్పాలంటే గ్రామ పాలన అంతా పవన్ చేతిలో పెట్టేశారు చంద్రబాబు. అటు సచివాలయంలో ప్రత్యేకంగా పవన్ కోసం పెద్ద ఛాంబర్ ను ఏర్పాటు చేస్తున్నారు. పవన్ అభిరుచులకు తగ్గట్టుగా దీనిని తీర్చిదిద్దుతున్నారు.

పవన్ కోసం కొత్త కాన్వాయ్ ను సైతం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పంచాయితీ కార్యాలయం నుంచి ఉన్నతాధికారి కార్యాలయం వరకు కూడా.. సీఎం చంద్రబాబు చిత్రపటం తో పాటు పక్కనే పవన్ ఫోటోను సైతం ఏర్పాటు చేయాలని తాజాగా సర్కార్ ఆదేశించినట్లు తెలుస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాలతో సహా ప్రతి చోటా ఈ రెండు చిత్రపటాలు ఉండి తీరాల్సిందేనని ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. వాస్తవానికి ఇప్పటివరకు ఇలాంటి విధానం లేదు. కేవలం ప్రభుత్వ కార్యాలయంలో సీఎం చిత్రపటం మాత్రమే ఉంటుంది. రాష్ట్రపతి, ప్రధాని ఫోటోలను ఏర్పాటు చేస్తారు. కానీ ఈసారి రాష్ట్రంలో ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పవన్కు గౌరవం ఇవ్వాలన్న కోణంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.