Perni Nani : అడ్డగోలుగా మాట్లాడే నేతలు కొందరు ఉంటారు. నిత్యం అడ్డదిడ్డంగా మాట్లాడుతూనే ఉంటారు. అటువంటి వారిలో మాజీ మంత్రి పేర్ని నాని( perni Nani ) ఒకరు. మీడియా ముందుకు వస్తే చాలు రెచ్చిపోతారు. వెనుకా ముందు కూడా చూడరు. అధికారంలో ఉన్నప్పుడు ఇతగాడి లీలలు వీర లెవెల్లో ఉండేవి. ఏకంగా పోలీస్ అధికారులను ఎవడయ్యా అంటూ సంబోధించిన సందర్భాలు ఉన్నాయి. పోనీ అప్పుడు అధికారంలో ఉండేవారు చెల్లుబాటు అయ్యేది అనుకుందాం. కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో వచ్చేసరికి అదే దూకుడు కనబరుస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏం చేయలేదన్న ధీమా, లేకుంటే చేస్తే చేసుకోండి అని మొండి పట్టుదల తెలియదు కానీ.. ఓ రేంజ్ లో రెచ్చిపోతున్నారు. మొన్న ఆ మధ్యన తన చేతి మీద ఉన్న వెంట్రుకను తీసి ఏం చేయలేరు అంటూ సవాల్ చేశారు. ఇప్పుడు ఓ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారిపై విరుచుకుపడ్డారు. దీనిపై వైద్య సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
* ఆసుపత్రి వద్ద దురుసు..
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్( Vamsi Mohan ) జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. గత వంద రోజులుగా ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ క్రమంలో ఇటీవల అస్వస్థతకు గురయ్యారు. దీంతో జైలు అధికారులు ఆరోగ్య పరీక్షల కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. దీంతో పేర్ని నాని తన అనుచరులతో అక్కడకు చేరుకున్నారు. ఆరోగ్య పరీక్షల కోసం వచ్చిన వంశీని కలిసేందుకు తమను అనుమతించాలని వీరంగం చేశారు. నిబంధనల ప్రకారం అలాంటివి సాధ్యం కాదని అధికారులు తేల్చేశారు. ఈ ఘటనతో పేర్ని నాని రెచ్చిపోయారు.
* చెంచాగిరి అంటూ విమర్శలు..
ముఖ్యంగా అక్కడ వైద్యుడి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పేర్ని నాని చేసిన కామెంట్స్ విమర్శలకు గురవుతున్నాయి. అక్కడ మత్తు డాక్టర్ ను ఉద్దేశించి..’ ఈ మత్తోడు ఆసుపత్రిలో ఉద్యోగానికి వచ్చినప్పటి నుంచి విజయవాడలో ఉంటున్నాడంట. అంటే ఎంతమందికి చెంచాగిరి చేస్తే ఎన్నాళ్ళు ఇక్కడున్నాడో? చంద్రబాబు లోకేష్ లకు అతడు చెంచాగిరి చేస్తున్నాడు. ఈ మత్తోడు ఇంతకింత అనుభవించే రోజులు దగ్గర్లో ఉన్నాయి అంటూ.. ఆసుపత్రి సూపరిండెంట్ పై రెచ్చిపోయారు. ఆసుపత్రిలోకి వెళ్లేందుకు అనుమతి లేదని ఎంత చెప్పినా.. వినకుండా అక్కడ సిబ్బందిని నెట్టుకుంటూ లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు పేర్ని నాని. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న వంశీని కలిసే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. చివరకు పోలీసులు ఎంట్రీ ఇచ్చి.. వారిని బలవంతంగా బయటకు పంపడంతో పరిస్థితి సాధారణ స్థితికి వచ్చింది.
* వైద్య సంఘాల ప్రతినిధుల ఆగ్రహం..
అయితే దీనిపై వైద్య సంఘాల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేర్ని నాని తీరును ఖండిస్తున్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వైద్య సంఘాల ఫిర్యాదు నేపథ్యంలో పేర్ని నాని పై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయన రెచ్చిపోతున్నారు. వరుసగా వైసీపీ నేతలు అరెస్ట్ అవుతున్న భయపడడం లేదు. అందుకే పేర్ని నాని విషయంలో సీరియస్ యాక్షన్కు దిగే అవకాశం కనిపిస్తోంది.
