AP Pensions Cut: ఏపీలో( Andhra Pradesh) రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ ప్రారంభం అయింది. సచివాలయ సిబ్బంది బదిలీల నేపథ్యంలో కొత్తవారు బాధ్యతలు తీసుకున్నారు. వారి నేతృత్వంలో పింఛన్ల పంపిణీ జరుగుతోంది. అయితే ఈరోజు దివ్యాంగులకు సంబంధించి చాలా మంది పింఛన్లు అందలేదు. వారి పింఛన్లను ఓల్డ్ లో పెట్టినట్లు ప్రచారం నడుస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్లపై ఫోకస్ పెట్టింది. సాధారణ పింఛన్ మొత్తాన్ని నాలుగువేల రూపాయలకు పెంచిన సంగతి తెలిసిందే. అయితే అప్పటి వరకు 4000 రూపాయల పింఛన్ ఉన్న దివ్యాంగులకు 6000 రూపాయలకు పెంచింది. మంచానికి పరిమితమైన వారికి రూ.10000, పదిహేను వేల రూపాయల చొప్పున పింఛన్లు అందిస్తోంది. కూటమి ప్రభుత్వ నిర్ణయంతో దివ్యాంగులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: చంద్రబాబు సింగపూర్ టూర్ పై పెద్దిరెడ్డి ‘పెద్ద’ కుట్ర?
* భారీగా అనర్హులు..
అయితే గత ప్రభుత్వంలో దివ్యాంగుల కోటాలో పింఛన్లు తీసుకుంటున్న వారిలో భారీగా అనర్హులు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అందుకే ప్రభుత్వం తనిఖీలు చేయించింది. ప్రత్యేక వైద్య బృందం వారికి తనిఖీలు చేసింది. దివ్యాంగ కోటాలో పింఛన్లు తీసుకుంటున్నవారికి నోటీసులు జారీ చేసి.. రి వెరిఫికేషన్ కు పిలిచారు. వారిలో అనర్హులను గుర్తిస్తున్నారు. అయితే చాలామంది నోటీసులు అందుకున్న వారు ఈ తనిఖీలకు వెళ్లడం లేదు. అటువంటి వారికి ఆగస్టు నెలకు సంబంధించి పింఛన్ నిలిపివేయనున్నారు. హోల్డ్ లో పెట్టి వారందరికీ సమాచారం ఇచ్చారు. రీ వెరిఫికేషన్ కు వస్తే పింఛన్ పునరుద్ధరిస్తామని తేల్చి చెబుతున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమందికి ఈనెల పింఛన్ నిలిచిపోనుంది.
* తప్పుడు ధ్రువపత్రాలతో..
గత ప్రభుత్వంలో ఎలాంటి వైకల్యం లేకపోయినా.. కొంతమంది వైద్యుల సహకారంతో సదరం ధ్రువపత్రాలు తయారు చేయించి.. పింఛన్లు పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎటువంటి వినికిడి, వైకల్య లోపం లేకపోయినా చాలామంది పింఛన్లు పొందారన్న ఆరోపణలు వినిపించాయి. ప్రతి గ్రామంలో పదుల సంఖ్యలో ఇలాంటి అనర్హులు ఉన్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లాయి. అందుకే ప్రభుత్వం వైద్యులతో కూడిన తనిఖీ బృందాలను ఏర్పాటు చేసింది. అయితే వీరి తనిఖీల్లో పెద్ద ఎత్తున బోగస్ పింఛన్లు బయటపడ్డాయి. ప్రధానంగా కడప, విజయనగరం లాంటి జిల్లాల్లో అధికంగా బోగస్ పింఛన్లు ఉన్నాయి. అయితే ఈ వెరిఫికేషన్ పూర్తి చేసి.. వీలైనంత త్వరగా అనర్హుల లెక్క తేల్చాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు సదరం సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ ప్రారంభం అయింది. రి వెరిఫికేషన్ నేపథ్యంలో సదరం సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను ప్రభుత్వం నిలిపివేసింది. ఇప్పుడు పునరుద్ధరించడంతో దివ్యాంగ పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సంక్రాంతి తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. దానికంటే ముందే కొత్త పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.