Peddireddy Ramachandra Reddy: ఏపీలో ( Andhra Pradesh)వైసీపీ నేతల అరెస్టు పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే చాలామందిపై కేసులు నమోదయ్యాయి. అరెస్టులు కూడా జరిగాయి. ఇటువంటి తరుణంలో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవడం సంచలనంగా మారింది. సార్వత్రిక ఎన్నికల్లో పెద్దిరెడ్డి కుటుంబం బలమైన ఉనికి చాటుకుంది. ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. కానీ పుంగనూరు నుంచి సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలిచారు. తంబళ్లపల్లె నుంచి ఆయన సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి సైతం విజయం సాధించారు. రాజంపేట నుంచి మిధున్రెడ్డి హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. అయితే ఇప్పుడు పెద్దిరెడ్డి కుటుంబం చుట్టూ వివాదాలు నడుస్తున్నాయి. ప్రధానంగా లిక్కర్ కేసులో మిధున్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
Also Read: కోటరీకి చెక్.. వైఎస్ఆర్ బాటలో జగన్.. కీలకనిర్ణయం
* నాసిరకం బ్రాండ్ల అమ్మకం
2019లో వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress ) అధికారంలోకి వచ్చింది. అప్పటివరకు ఉన్న మద్యం పాలసీని మార్చింది. ప్రభుత్వమే నేరుగా మద్యం దుకాణాలను నడిపింది. అప్పట్లో నాసిరకం బ్రాండ్ల మద్యం విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. కేవలం మద్యం విక్రయాల ద్వారా 30 వేల కోట్ల రూపాయలకు పైగా నాటి ప్రభుత్వ పెద్దలకు ముడుపులు అందినట్లు ప్రచారం ఉంది. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం అవకతవకలపై దృష్టి పెట్టింది. అప్పట్లో ప్రధానంగా పెద్దిరెడ్డి కుటుంబం పేరు ప్రముఖంగా వినిపించింది.
* ప్రధానంగా ఆ ఆరోపణలు
జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy) పెద్దిరెడ్డి కుటుంబానికి అత్యంత ప్రాధాన్యమిచ్చారు. అప్పట్లో మద్యం డిష్టలరీలను, మద్యం సరఫరా చేసే సంస్థలను లోబరుచుకున్నారన్న ఆరోపణలు పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి పై ఉన్నాయి. గత సెప్టెంబర్ లో సిఐడి దర్యాప్తు ప్రారంభం అయింది. అప్పట్లో మిధున్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపించింది. ఇటీవల మద్యం కుంభకోణం విచారణకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. తాజాగా విజయసాయిరెడ్డి మద్యం స్కాం విషయాన్ని ప్రస్తావించారు. ఈ పరిణామాల క్రమంలోనే మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ కు అప్లై చేసుకున్నట్లు తెలుస్తోంది.
* జగన్ కు అండగా ఫ్యామిలీ
జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడుతోంది పెద్దిరెడ్డి కుటుంబం( peddireddy family) . అందుకే పెద్దిరెడ్డి కుటుంబం పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. ఇప్పటికే పెద్దిరెడ్డి పై అటవీశాఖ ఆరోపణలు ఉన్నాయి. అటవీ శాఖ భూములను ఆక్రమించారని కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో లిక్కర్ స్కాంలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనను ఏ క్షణంలోనైనా అరెస్టు చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలోనే మిధున్ రెడ్డి ముందస్తు బెయిల్ కు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మరి కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.