Payyavula Keshav: ఆ సెంటిమెంట్ కు బ్రేక్ వేసిన పయ్యావుల కేశవ్

1994లో ఉరవకొండ నియోజకవర్గం నుంచి తొలిసారిగా కేశవ్ ఎమ్మెల్యే అయ్యారు. ఆ ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి వచ్చింది. 1999 ఎన్నికల్లో కేశవ్ ఓడిపోయారు.

Written By: Dharma, Updated On : June 13, 2024 10:24 am

Payyavula Keshav

Follow us on

Payyavula Keshav: రాజకీయాల్లో కొన్ని సెంటిమెంట్లు బాగానే పనిచేస్తాయి. అందుకే పార్టీలు సైతం సెంటిమెంట్లను ఎక్కువగా గౌరవిస్తాయి. అయితే ఈ ఎన్నికల్లో చాలా రకాల సెంటిమెంటులు పటాపంచలు అయ్యాయి. ముఖ్యంగా ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ విషయంలో ఎంతవరకు సాగిన సెంటిమెంట్ కు బ్రేక్ పడింది. అక్కడ పయ్యావుల కేశవ్ గెలిస్తే పార్టీ అధికారంలోకి రాదన్న సెంటిమెంట్ కొనసాగేది. కానీ ఈసారి పయ్యావుల కేశవ్ గెలిచారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఏకంగా ఆయన మంత్రి అయ్యారు.

1994లో ఉరవకొండ నియోజకవర్గం నుంచి తొలిసారిగా కేశవ్ ఎమ్మెల్యే అయ్యారు. ఆ ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి వచ్చింది. 1999 ఎన్నికల్లో కేశవ్ ఓడిపోయారు. కానీ టిడిపి అధికారంలోకి వచ్చింది. 2004, 2009 ఎన్నికల్లో పయ్యావుల కేశవ్ గెలిచారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షానికి పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2014లో కేశవ్ ఓడిపోయారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. 2019లో రాయలసీమలో టిడిపి తుడిచిపెట్టుకుపోయింది. కానీ ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్ గెలిచారు. కుప్పం నుంచి చంద్రబాబు, హిందూపురం నుంచి బాలకృష్ణ విజయం సాధించారు.

అయితే ఉరవకొండ నుంచి కేశవ్ గెలిస్తే పార్టీ ఓడిపోతుందని.. కేశవ్ ఓడిపోతే టిడిపి గెలుస్తుందని ఒక సెంటిమెంట్ నడుస్తూ వచ్చింది. కానీ ఈ ఎన్నికల్లో ఆ రికార్డును బ్రేక్ చేస్తానని ప్రచారంలో కేశవ్ సవాల్ చేశారు. 1994 ఫలితాలు రిపీట్ అవుతాయని తేల్చి చెప్పారు. ఆయన అన్నట్టుగానే ఎమ్మెల్యేగా పయ్యావుల కేశవ్ గెలిచారు. టిడిపి సూపర్ విక్టరీ సాధించింది. ఎన్టీఆర్ పిలుపుమేరకు రాజకీయాల్లోకి వచ్చారు కేశవ్. కానీ ఆయనకు మంత్రి పదవి దక్కేందుకు 30 సంవత్సరాలు పట్టింది. ఆయన గెలిస్తే పార్టీ ఓడిపోవడం.. పార్టీ గెలిస్తే ఆయన ఓటమి చవిచూడడం పరిపాటిగా మారింది. కానీ ఈసారి మాత్రం పార్టీ అధికారంలోకి రావడమే కాదు.. తన చిరకాల వాంఛ అయిన మంత్రి పదవి దక్కింది.