Tirupati stampede : ఏపీ డిప్యూటీ సీఎం పవన్( deputy CM Pawan) సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటిస్తున్నారు. నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. అయితే ఈ ఏడాది సంక్రాంతి సంబరాలు అనుకున్న స్థాయిలో చేసుకోలేకపోతున్నట్లు వెల్లడించారు. తిరుపతిలో జరిగిన ఘటన తనకు బాధ కలిగించిందన్నారు తనకు పని చేయడం తప్ప విజయం గురించి తెలియదు అన్నారు. అటువంటి తనకు పిఠాపురం ప్రజలు ఘనవిజయం అందించారని గుర్తు చేశారు. పిఠాపురం నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన విజయంతోనే రాష్ట్రానికి రెండు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. పిఠాపురంలో సంక్రాంతి బాగా చేసుకుందామని అనుకున్నామని… తిరుపతి ఘటనతో తగ్గించి చేస్తున్నామని పవన్ వెల్లడించారు. ఈ సందర్భంగా తిరుపతి తొక్కిసలాటకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు పవన్.
* ఆ ఇద్దరిపై ఆగ్రహం తిరుపతిలో( Tirupati) తొక్కిసలాట జరిగిన తరువాత డిప్యూటీ సీఎం పవన్ సందర్శించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈవో, జేఈఓ లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు మీ ఇద్దరు ఏం చేస్తున్నట్టు అని ప్రశ్నించారు. మీ నుంచి ప్రజల వద్ద మేం తిట్లు తింటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ అక్కడ చైర్మన్ బిఆర్ నాయుడు( TTD chairman BR Naidu ) గురించి ప్రస్తావించలేదు. అయితే ఈరోజు పిఠాపురంలో మాత్రం ఆయన చైర్మన్ తో పాటు జేఈవో గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. చైర్మన్ నాయుడుతో పాటు జేఈవో వెంకయ్య చౌదరి కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పడానికి నామోషి ఎందుకని ప్రశ్నించారు. అధికారులు తప్పు చేయడంతోనే తాను సంక్రాంతి పండుగ చక్కగా చేసుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పు చేస్తే తనను కూడా శిక్షించాలని.. ఇదే విషయాన్ని చాలా సందర్భాల్లో కూడా చెప్పానని పవన్ గుర్తు చేశారు.
* కీలక సూచనలు
మరోవైపు తిరుమలలో సందర్శించినప్పుడు పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan)టిటిడి అధికారులకు కీలక సూచనలు చేశారు. మృతుల కుటుంబాలను పరామర్శించాలని సూచించారు. టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యులతో పాటు అధికారులు వారి ఇళ్లకు వెళ్లి పరిహారం చెక్కులు అందించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో టీటీడీ ట్రస్ట్ బోర్డు అత్యవసర సమావేశం ఈరోజు ఏర్పాటు చేయనుంది. పరిహారం చెక్కుల జారీకి సంబంధించి తీర్మానం ఆమోదించనుంది. చెక్కులను రూపొందించి శనివారం ఉదయం మృతుల స్వగ్రామాలకు వెళ్లి అందించాలని నిర్ణయించింది టీటీడీ. మరోవైపు పవన్ టీటీడీకి కీలక సూచనలు కూడా చేశారు. తిరుమలలో విఐపి కల్చర్( VIP culture) తగ్గించాలని… ప్రముఖుల దర్శనాలు వీలైనంత తగ్గించుకోవాలని సూచించారు. దీనిపై కూడా టీటీడీ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
* మినీ గోకులాలు ప్రారంభం
మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన పిఠాపురంలో( Pithapuram ) కొనసాగుతోంది. కుమారపురంలో పవన్ ఈరోజు మినీ గోకులాన్ని ప్రారంభించారు. శ్రీకృష్ణుని ఆలయం వద్ద నిర్మించిన ఈ గోకులాన్ని ప్రారంభించి.. రైతు యాతం నాగేశ్వరరావు కి అందజేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధులు 1.85 లక్షల వ్యయంతో దీనిని నిర్మించారు. మినీ గోకులాన్ని ప్రారంభించి నాలుగు ఆవులను రైతులకు పవన్ అందించారు. ఇదే వేదిక నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిర్మించిన 12,500 మినీ గోకులం షెడ్లను లాంఛనంగా ప్రారంభించారు పవన్.