Pawankalyan : లోక కళ్యాణార్ధం పవన్ కళ్యాణ్ యాగం మొదలుపెట్టారు. ఇందుకు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం వేదికగా మారింది. జూన్ 14 నుంచి పవన్ వారాహి యాత్ర ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. అన్నవరం టు భీమవరం వరకూ చేపట్టనున్న యాత్రలో దాదాపు 11 నియోజకవర్గాల్లో పవన్ పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లలో జనసేన యంత్రాంగం నిమగ్నమైంది. ప్రతి నియోజకవర్గానికి యాత్ర బాధ్యులను నియమించనున్నారు. భారీ జన సమీకరణకు నిర్ణయించారు.
యాత్రకు రెండురోజులు ముందుగానే పవన్ ఏపీకి చేరుకున్నారు. అమరావతి కేంద్ర కార్యాలయంలో కీలక కార్యక్రమాలను శ్రీకాకరంచుట్టారు. సోమవారం ఉదయం 5 గంటలకు సంప్రదాయ వస్త్రధారణలో చేరుకున్న పవన్ పూజలు జరిపారు. అయిదుగురు దేవతా మూర్తులను అధిష్టించి యాగాన్ని నిర్వహిస్తున్నారు. స్థిరత్వం స్థిత ప్రజ్ఞత ప్రసాదించే గణపతి అలాగే శత్రు నిరోధిత దేవత చండీ మాత అష్టైశ్వర ప్రసాదితులు అయిన శివ పార్వతులు ఆయురారోగ్య ప్రదాత సూర్య భగవానుడు త్రిస్థితి యుక్త కారకుడు విష్ణు మూర్తిలను యాగపీఠం మీద ప్రతిష్టించి యాగాన్ని నిర్వహిస్తున్నారు.దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. అయితే… ఈ యాగం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి చేసిన భూమి పూజ అని తెలుస్తోంది.
జనసేన పార్టీ కేంద్ర కార్యాలయ కార్యకలాపాలు ఇప్పటి వరకూ హైదరాబాద్ నుంచి సాగుతున్నాయి. ఇకపై మంగళగిరి నుంచే పార్టీ కేంద్ర వ్యవహారాలు కొనసాగించాలని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. అందులో భాగంగానే కేంద్ర కార్యాలయ భవనానికి భూమి పూజ చేపట్టారు. కార్యాలయ నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేయాలని ఇంజినీరింగ్ నిపుణులకు పవన్ సూచించారు. కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఓ వైపు భూమి పూజ, మరో వైపు యాగ నిర్వహణతో ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో పాటు సందడిని నెలకొంది. =