Social Media : ఏపీలో గత కొద్ది రోజులుగా రాజకీయ దుమారం నడుస్తోంది. ప్రధానంగా వైసీపీ సోషల్ మీడియా పై పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు.సోషల్ మీడియా కార్యకర్తలను పెద్ద ఎత్తున అరెస్టు చేస్తున్నారు. వారిపై కేసులు కూడా నమోదు అవుతున్నాయి. ఈ క్రమంలో వైసీపీకి మద్దతు తెలిపిన సెలబ్రిటీలు సైతం కేసులు బారిన పడుతున్నారు.ఈ తరుణంలో వైసీపీ అధినేత జగన్ స్పందించారు. కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. అరెస్టులపై ఘాటుగా స్పందించారు కూడా. పార్టీ బాధితులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో పార్టీ తరఫున ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేశారు. ఎక్కడైనా వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధులపై కేసులు నమోదు అయినా.. అరెస్టు జరిగినా.. వెంటనే ఈ టాస్క్ ఫోర్స్ ప్రతినిధులు స్పందిస్తారు. వారిని పరామర్శించి ధైర్యం నింపే ప్రయత్నం చేస్తారు. అయితే సోషల్ మీడియా విషయంలో అధికార విపక్షాల మధ్య గట్టి యుద్ధమే నడుస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ప్రతిపాదన చేశారు. సోషల్ మీడియా దూకుడుకు బ్రేకులు వేసేలా కొత్తగా చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దీనికి సంబంధించిన బిల్లును అసెంబ్లీలో పెట్టి చర్చించాలని సూచించారు.
* ఈ సమావేశాల్లోనే ఆ బిల్లు
ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈనెల 22 వరకు ఈ సమావేశాలు కొనసాగునున్నాయి. ఈ సమావేశాల్లోనే సోషల్ మీడియా నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టాలని తీర్మానించినట్లు సమాచారం. సోషల్ మీడియా అబ్యూజ్ ప్రొటెక్షన్ బిల్లు సభలో ప్రవేశపెట్టేలా చర్యలు తీసుకోవాలని పవన్ సూచించారు. దీంతో కార్యాచరణ ప్రారంభమైనట్లు సమాచారం. శాసనసభలో పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళగా ఉన్న రాష్ట్ర హోం మంత్రిని సైతం విడిచిపెట్టడం లేదని.. శాడిస్టుల వ్యవహరిస్తున్నారని పవన్ విమర్శించారు. సోషల్ మీడియాతో పాటు డిజిటల్ ప్లాట్ఫామ్ పూర్తిగా దుర్వినియోగం అవుతుందని.. ప్రమాదకర స్థాయికి చేరుకుంటుందని పవన్ ఆందోళన వ్యక్తం చేశారు. అప్పట్లో ఎంపీగా పనిచేసిన రఘురామకృష్ణంరాజు పట్ల వ్యవహరించిన తీరును కూడా పవన్ గుర్తు చేశారు. ఈ సైబర్ బెదిరింపులకు చరమగీతం పాడాలని కూడా పిలుపునిచ్చారు పవన్. అందుకే సోషల్ మీడియా అబ్యూజ్ ప్రొటెక్షన్ బిల్లును ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని కూడా చెప్పుకొచ్చారు.
* ఇదే మంచి సమయం
అయితే ఇప్పటికే ఏపీ పోలీసులు దూకుడు మీద ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అరెస్టుల పర్వం కొనసాగిస్తున్నారు. గతంలో సైబర్ నేరాలకు సంబంధించి 41 ఏ నోటీసులు అందించి చేతులు దులుపుకునేవారు. అయితే మారిన చట్టాలు, కఠిన సెక్షన్ల నేపథ్యంలో అటు బాధితులు సైతం బెదిరిపోతున్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తే సోషల్ మీడియాలో దుర్వినియోగాన్ని నియంత్రించవచ్చని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. అందుకే పవన్ ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలిసినట్లు ప్రచారం జరుగుతోంది. అక్కడ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించడంతోనే పవన్ ఈ విషయాన్ని అసెంబ్లీలో లేవనెత్తారని తెలుస్తోంది. మొత్తానికైతే సోషల్ మీడియా నియంత్రణకు కూటమి ప్రభుత్వం గట్టిగానే ప్రయత్నాలు చేస్తోందన్న మాట.