Chandrababu Delhi Tour : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి ఏపీకి రానున్నారు. ఆయన పర్యటన ఖరారు అయ్యింది. ఈనెల 29న ఆయన ఏపీకి రానున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు.ప్రధాని పర్యటన గురించి ప్రకటించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత..ప్రధాని అధికారిక పర్యటన ఇదే కావడం విశేషం. అందుకే ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖ కేంద్రంగా 80 వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో స్థాపిస్తున్న గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కుకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు ప్రధాని ఏపీ పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ఫిక్సయింది. ప్రధానమంత్రి కార్యాలయం సైతం అధికారికంగా వెల్లడించనుంది. విశాఖలో ఎన్టిపిసి 80 వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు గ్రీన్ అమోనియా, గ్రీన్ హైడ్రోజన్ హబ్ లను ఏర్పాటు చేయనుంది. దానినే ప్రారంభించనున్నారు ప్రధాని మోదీ. ప్రధాని పర్యటనకు సంబంధించి చంద్రబాబు అసెంబ్లీలో అధికారిక ప్రకటన చేశారు. ఈ ప్రాజెక్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో 1200 ఎకరాల భూమిని కేటాయించినట్లు గుర్తు చేశారు. గ్రీన్ హైడ్రోజన్ హబ్ లో 20 గిటార్ వాట్ల విద్యుత్ ను ఎన్టిపిసి ఉత్పత్తి చేయనుంది. ఈ రెండు భారీ ప్రాజెక్టుల వల్ల నాలుగేళ్లలో 48 వేల మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది.
* ప్రత్యేక ఆహ్వానం
మరోవైపు సీఎం చంద్రబాబు ఈరోజు ఢిల్లీ వెళ్తున్నారు. కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నారు ప్రధాని మోదీని. ఇప్పటికే కేంద్రం అమరావతి రాజధాని తో పాటు పోలవరం ప్రాజెక్టుకు సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. విశాఖ రైల్వే జోన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కూడా. మరోవైపు అమరావతి రాజధానిలో రోడ్డు, రైలు ప్రాజెక్టులకు సైతం ప్రాధాన్యమిచ్చింది. అందుకే ఈ పర్యటనలో భాగంగానే విశాఖ రైల్వే జోన్ పనులను ప్రధాని ప్రారంభించే అవకాశం ఉంది.
* రోజంతా బిజీబిజీ
చంద్రబాబు ఢిల్లీలో బిజీబిజీగా గడపనున్నారు.ప్రధాని మోదీ తో పాటు కేంద్ర మంత్రులను కలవనున్నారు. రైల్వే శాఖ మంత్రి తో సమావేశమై విశాఖ రైల్వే జోన్ పనుల ప్రారంభోత్సవం పై ఒక నిర్ణయం తీసుకొనున్నారు. ఓ మీడియా సంస్థ ఏర్పాటు చేసిన డిబేట్లో సైతం చంద్రబాబు పాల్గొంటారని తెలుస్తోంది. ఇప్పటికే అమరావతి నిర్మాణ పనులను ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది. అయితే అక్కడ ప్రత్యేక రైల్వే లైన్ నిర్మాణానికి ప్రధానితో శంకుస్థాపన చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. పనిలో పనిగా ఈ కార్యక్రమానికి సైతం ప్రధానిని ప్రత్యేకంగా ఆహ్వానించనున్నారు.