Pawan Kalyan : ఏపీ పాలిటిక్స్ రోజురోజుకూ హాట్‌హాట్‌గా మారుతున్నాయి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి వైసీపీ నేతలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. గత ప్రభుత్వంలోని నేతలు చేసిన అక్రమాలు, అవినీతికి సంబంధించి వెలికితీస్తూనే ఉంది. ముఖ్యంగా జగన్‌ను టార్గెట్ చేస్తూ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. అందులోనూ జగన్ వర్సెస్ పవన్ అన్నట్లుగా ఏపీ రాజకీయాలు కొనసాగుతున్నాయి. డిప్యూటీ సీఎం అయినప్పటి నుంచి పవన్ కల్యాణ్ జగన్‌పై కత్తులు నూరుతూనే ఉన్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో అనుచిత పోస్టింగులు పెడుతున్న వారిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అలాంటి పోస్టులు పెట్టిన వారిని పోలీసులు అరెస్ట్ చేస్తూనే ఉన్నారు.
అయితే.. దీనిపై జగన్ స్పందించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారందరికీ మద్దతుగా నిలుస్తామని చెప్పారు. నిబంధనలకు వ్యవహరించే అధికారులకు సైతం జగన్ హెచ్చరికలు జారీ చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత వదిలేని లేదని తేల్చిచెప్పారు. సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా పట్టుకొచ్చి మరీ చర్యలు తీసుకుంటామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక జగన్ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం పవన్ స్పందించారు. జగన్‌పై ఆయన సీరియస్ అయ్యారు. అంతేకాదు.. అధికారులను బెదిరిస్తే సుమోటో కేసులు పెడతామని హెచ్చరించారు. వారిని టచ్ చేసి చూడండి అంటూ హెచ్చరించారు. తమది మంచి ప్రభుత్వమే కానీ.. మెతక ప్రభుత్వం కాదని వైసీపీ అధినేత జగన్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు.. కూటమి నేతలే లక్ష్యంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై కేసులు కొనసాగుతూనే ఉన్నాయి. పలువురిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. వైసీపీ నేతలు కూడా పోలీసులకు ఉల్టా ఫిర్యాదులు చేస్తున్నారు. తమ నేతలపై పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గుంటూరులో పర్యటన ఉన్న పవన్ విధుల్లో ప్రాణాలు వదిలిన అటవీ శాఖ అధికారులకు నివాళి అర్పించారు. వారి త్యాగాలను స్మరించుకున్నారు. గతంలో ఎర్రచందనం కాపాడడంలో ప్రాణాలు వదిలిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. వారి సేవలను కొనియాడారు. విధి నిర్వహణలో ప్రాణాలు ఇచ్చిన వారందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా మరిన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం హయాంలోనే నేరాలు పెరిగాయని అన్నారు. అలాగే.. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల అడిగితే భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. మహిళల భద్రత విషయంలో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సూచించారు. అలాగే.. అధికారుల మీద చిన్న గాటు పడినా చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. అధికారులను ఇష్టం వచ్చినట్లు గత ప్రభుత్వం వాడుకుందని అన్నారు. ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి అడవులను కాపాడేందుకు ఎలాంటి సహాయం కావాలన్నా ప్రభుత్వం తరఫున తప్పకుండా అందిస్తామని భరోసా ఇచ్చారు. ఎక్కడా మనోధైర్యం కోల్పోకుండా.. ఎవరికీ భయపడకుండా తమ విధులను నిర్వర్తించాలని సూచించారు.