Pawan Movies vs Politics: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( deputy CM Pawan Kalyan) పెద్దగా కనిపించడం లేదు ఎందుకు? సినిమా షూటింగ్లలో బిజీగా ఉన్నారా? పెండింగ్ సినిమాలపై దృష్టి పెట్టారా? కొత్త సినిమాలకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? 2027 వరకు ఆయన నటిస్తారా? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. పవన్ కళ్యాణ్ కొన్నిసార్లు కనిపించడం లేదు. అలాగని ఆయన సినిమా షూటింగులకు హాజరవుతున్నారని ప్రకటించడం లేదు. కానీ ఆయన నటించిన చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అంటే ఆయన తన మంత్రి పదవి బాధ్యతలు చూస్తూనే.. సినిమా షూటింగ్లకు హాజరవుతున్నారన్నమాట. ఆయన నటించిన హరిహర వీరమల్లు ఈనెల 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మరోవైపు ఓజీ సినిమా సైతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని ఆ చిత్ర యూనిట్ ధ్రువీకరించింది. అంటే గ్యాప్ లో పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్లకు హాజరవుతున్నారన్నమాట.
ఎట్టకేలకు హాజరు..
ఏపీలో( Andhra Pradesh) కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది. 2024 మేలో ఎన్నికలు జరిగాయి. జూన్ లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. అయితే 2023 ద్వితీయార్థంలో సినిమా షూటింగ్ ల నుంచి రాజకీయాల్లో అడుగుపెట్టారు పవన్ కళ్యాణ్. అప్పటినుంచి సినిమా షూటింగ్లకు హాజరు కావడం లేదు. పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టి పెట్టారు. ముందుగా వారాహి యాత్ర చేపట్టారు. 2024 సంక్రాంతి అనంతరం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ వచ్చారు. సొంత నియోజకవర్గంలో పిఠాపురం పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. అయితే అప్పట్లో చాలా సినిమా షూటింగులు పెండింగ్లో ఉండిపోయాయి. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత, మంత్రి పదవులు చేపట్టాక నేరుగా సినిమా షూటింగులకు హాజరైతే విమర్శలకు తావిచ్చినట్లు అవుతుందని భావించారు పవన్. అందుకే ఏడాది పాటు సినిమా షూటింగ్లకు దూరంగా ఉంటూ వచ్చారు.
ఫ్యాన్స్ ఖుషి..
అయితే ఇప్పుడు వరుసగా సినిమా షూటింగ్లకు( cinema shootings ) హాజరవుతున్నారు. దీంతో జనసైనికులతో పాటు పవన్ కళ్యాణ్ అభిమానుల సైతం ఆనంద వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలో పవన్ కళ్యాణ్ పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చాలా రకాలుగా విమర్శలు చేసింది. పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లోకి వెళ్లిపోతారని.. రాష్ట్ర ప్రజలు ఆయన సినిమా షూటింగుల వద్దకు వెళ్లి సమస్యలు విన్నవించే పరిస్థితి ఉంటుందని ఎద్దేవా చేసింది. అయితే ప్రజలు ఈ మాటలను నమ్మలేదు. జనసేనకు అండగా నిలిచారు. పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు కూటమికి మద్దతు ఇచ్చారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా షూటింగులకు హాజరు కావడంతో.. వరుసగా ఆయన నటిస్తున్న చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు కొత్త సినిమాల ప్రాజెక్టులకు సంబంధించి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
చెప్పినట్టే పవన్ సాహసం..
అయితే పవన్ కళ్యాణ్ సినిమాల విషయంలో చాలా స్పష్టమైన ప్రకటనలు గతంలో చేశారు. తనకు సినిమాల కంటే రాజకీయాలు ఇష్టమని.. ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని.. రాజకీయాలు చేయాలంటే డబ్బులు అవసరమని.. అది కావాలంటే సినిమాల్లో నటించాల్సిందేనని చెప్పుకొచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ అదే తెగింపుతో వ్యవహరిస్తున్నారు. ఒకవైపు రాజకీయాలు చేస్తూనే.. మంత్రిగా బాధ్యతలు చేపడుతూనే.. సినిమా షూటింగులకు హాజరవుతున్నారు. కొత్త ప్రాజెక్టులకు సైతం సైన్ చేస్తున్నారు. ఈ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ కు అభిమానించక తప్పదు. సినిమా అనేది తన వృత్తి అని.. రాజకీయం అనేది తన ప్రవృత్తి అని గట్టిగానే చెబుతున్నారు పవన్. మరి దీనిపై విపక్షం ఎలా స్పందిస్తుందో చూడాలి.
సినిమాలన్నీ పూర్తి చేసి 2029 వరకూ అన్నింటి రెమ్యూనరేషన్లతో జనసేనను బలోపేతం చేయాలని పవన్ పెద్ద ప్లాన్ చేస్తున్నారు. 2029 ఎన్నికల్లో జనసేనను ఏపీ వ్యాప్తంగా మెజార్టీ సీట్లలో పోటీకి దింపి కింగ్ మేకర్ కావాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అదే జరిగితే చంద్రబాబు వయోభారంతో తప్పుకుంటే సీఎం సీటును ఆశించివచ్చని జనసైనికుల ఊవాచ. అందుకే వీలైనన్నీ సినిమాలను 2029లోపే పూర్తి చేసి ఫుల్ టైం రాజకీయాలు చేయాలని పవన్ పెద్ద స్కెచ్ గీసినట్టుగా తెలుస్తోంది.