Pawankalyan Vs YS Jagan : రాజకీయాల్లో విమర్శలకు ప్రతి విమర్శలుంటాయి. ఇది సాధారణమే అయినా.. వ్యక్తిగత కామెంట్లు చేసినప్పడు చాలా హుందాతనం ప్రదర్శించాలి. లేకుంటే ఇట్టే దొరికిపోతాం. ఒకరిపై విమర్శలు చేస్తే.. అదే సమయంలో అటువైపు నుంచి రెట్టింపు విమర్శలు వస్తాయి. దానిని తట్టుకొని నిలబడాలి. లేకుంటే నవ్వులపాలవుతాం. జనం కంటే ఇప్పుడు సోషల్ మీడియా వాయిసే అధికం. మనం ఏం చేసినా ఇట్టే దొరికిపోతాం. నిన్నటికి నిన్న అమ్మఒడి నిధులకు బటన్ నొక్కే క్రమంలో జగన్ పవన్ పై అటాక్ చేశారు. అక్కడికి కొద్ది గంటల తరువాత పవన్ దానిపై కౌంటర్ అటాక్ ఇచ్చారు. అయితే జగన్ కంటే పవన్ చేసిన వ్యాఖ్యలే విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
కురుపాం సభలో జగన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. పవన్ వైవాహిక జీవితం, వారాహి వాహనంపై కూడా వ్యాఖ్యలు చేశారు. ఆయనలా వైవాహిక జీవితంతో వీధిన పడలేనని కూడా ఎద్దేవా చేశారు. లారీపై ఊగుతూ.. తూగుతూ మాట్లాడలేనని కూడా తన హవభావాలతో చెప్పుకొచ్చారు. ఒకటేమిటి అనరాని మాటలు అనేశారు. వారాహి యాత్రలో పవన్ ప్రభుత్వ వైఫల్యాలు మాట్లాడినందుకు జగన్ అలా మాట్లాడారు. కానీ పవన్ లేవనెత్తిన వైఫల్యాలపై మాట్లాడకుండా.. తమ ప్రభుత్వం చేసిన మంచి పనులు ప్రస్తావించకుండా.. కేవలం పవన్ పై వ్యక్తిగత కామెంట్స్ కే పరిమితమయ్యారు. పవన్ కు అడ్డంగా బుక్కయ్యారు.
ఉదయం జగన్ మాట్లాడితే.. సాయంత్రానికి పవన్ కౌంటర్ అటాక్ ప్రారంభించారు. తాను ఊగుతూ మాట్లాడానా? అయితే రేపటి నుంచి మీలా మాట్లాడుతానంటూ చేతులు సాగదీసి.. మాటలను అంతకంటే ఎక్కువ సాగదీసి ప్రసంగించారు. దీంతో అక్కడున్న జన సైనికుల్లో నవ్వులే నవ్వులు విరిశాయి. రేపటి భీమవరంలో మీలా మాట్లాడుతానంటూ చెబుతూ హెచ్చరించారు. వారాహి అనే పదానికి కూడా అర్ధం తెలియని వ్యక్తి సీఎంగా ఉండడం సిగ్గుచేటన్నారు. వయోజన విద్యలో చేర్పిస్తే కాస్తా పదాలైనా అర్ధమవుతాయని సెటైర్ వేశారు. అవసరమైతే తన వద్దకు వస్తే నేర్పిస్తానంటూ సవాల్ చేశారు. వాస్తవానికి ఉదయం కురుపాం సభలో పేపరు చూసి చదవడానికి కూడా జగన్ ఇబ్బందిపడ్డారు. తత్తరపాటుకు గురయ్యారు. పవన్ మాత్రం జగన్ పై అవలీలగా మాట్లాడారు. ఇది రిహార్సల్ మాత్రమేనని.. భీమవరం సభలో సినిమా చూపిస్తానని చెప్పి జన సైనికులకు ఖుషీ చేశారు.