Pawan Kalyan : పవన్ కళ్యాణ్ పై వాయిదాల అపవాదు ఉంది. ఏ కార్యక్రమం నిర్వహించినా.. షెడ్యూల్ ప్రకటించినా.. అనుకున్నట్టు సాగించరు అన్నది ఒక విమర్శ. ఆయన మాటలు కోటలు దాటుతాయని.. చేతలు మాత్రం ఏవి ఉండవు అని ప్రత్యర్థులు ఆరోపిస్తుంటారు. వీటిని సీరియస్ గా తీసుకున్నట్టు ఉన్నారు. అందుకే అటువంటి వాటికి చెక్ చెప్పారు. గత మూడు రోజులుగా పవన్ తాను పోటీ చేయబోయే పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అనారోగ్యం అంటూ ఆయన ఆదివారం సాయంత్రం హైదరాబాద్ వెళ్ళిపోవడం దుమారానికి దారితీసింది. ఆయన మరీ అంత సుకుమారమా? ప్రజల్లో ఒకటి,రెండు రోజులు కూడా ఉండలేరా? అనే ప్రశ్నలు వినిపించాయి. కానీ ఆయన మళ్లీ హైదరాబాద్ నుంచి పిఠాపురం చేరుకోవడం మాత్రం ఆశ్చర్యం వేస్తోంది.
అసలే ఎన్నికలు ప్రచారం. ఉన్నది 40 రోజులే. ఇందులో తన పార్టీ అభ్యర్థులు పోటీ చేయబోయే నియోజకవర్గాలకు 21 రోజులు కేటాయించాలి. మధ్యలో భాగస్వామ్య పక్షాల నేతలతో భారీ బహిరంగ సభలో పాల్గొనాలి. రోడ్ షోలు చేయాల్సి ఉంటుంది. అంటే పవన్ క్షణం తీరిక లేకుండా గడపాల్సిన పరిస్థితి. ఇప్పుడు గాని వాయిదాలు వేసుకుంటే దాని పర్యవసానాలు పవన్ కు తెలుసు. అందుకే ఆరు నూరైనా.. నూరు నూట అరవై ఆరు అయినా ఈ 40 రోజులు ప్రజాక్షేత్రంలో ఉండాలని పవన్ నిర్ణయించుకున్నారు. మొన్న శనివారం పవన్ పిఠాపురం వెళ్లారు. ఆ సాయంత్రం నుంచి ఎన్నికల ప్రచార సభలు నిర్వహించారు. నిన్నంతా నియోజకవర్గంలోనే గడిపారు. కానీ అనారోగ్యానికి గురి కావడంతో హైదరాబాద్ వెళ్ళిపోయారు. దీంతో పవన్ పై ఒకరకమైన ప్రచారం ప్రారంభమైంది. మళ్లీ వాయిదా వేశారు అంటూ నీలి మీడియా ప్రచారం మొదలు పెట్టింది. అయితే పవన్ సోమవారం ఉదయం పిఠాపురంలో ప్రత్యక్షమయ్యారు. తిరిగి కార్యక్రమాలను మొదలుపెట్టారు. నీలి మీడియా నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లు అయ్యింది.
పవన్ అటు సినిమా రంగం.. ఇటు రాజకీయరంగంలో కొనసాగుతూ వచ్చారు. రెండు పడవలపై నడిచారు. దీనిపై విపక్షాలు విమర్శలు చేశాయి. ఇలా అయితే రాజకీయాలు చేయలేరని విశ్లేషణలు సాగాయి. అయితే అది వాస్తవం కూడా. రాజకీయం అన్నాక నిత్యం వ్యూహాలు రూపొందించుకోవాలి. ప్రజల మధ్య ఉండాలి. ప్రజా సమస్యలపై పనిచేయాలి. కానీ రాజకీయాలు చేయడానికి, పార్టీని నడిపించడానికి సినిమాలు తప్పకుండా చేయాల్సి వస్తుందని పవన్ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో క్లిష్ట సమయం ఇది. ఇటువంటప్పుడు జాప్యం చేసినా.. కార్యక్రమాలను వాయిదా వేసినా.. దాని పర్యవసానాలు పవన్ కు తెలియనివి కావు. అందుకే పవన్ తగ్గేదేలే అంటూ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. అనారోగ్యానికి సైతం లెక్క చేయడం లేదు. అయితే పవన్ లో ఈ మార్పు చూసి విపక్షాలు కాస్త కంగారు పడుతున్నాయి. ఆయన గానీ ఇదే ఊపుతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తే ఇబ్బందికర పరిస్థితులు తప్పవని భయపడుతున్నాయి.