Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం గా పవన్ బాధ్యతలు తీసుకున్నారు. గత ఐదు నెలలుగా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో తొలిసారిగా శాసనమండలిలో మాట్లాడారు పవన్. ఇదే తొలి స్పీచ్ కూడా. అయితే శాసనసభలో వైసీపీ సభ్యులు లేరు. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని నిరసిస్తూ జగన్ నేతృత్వంలోని వైసీపీ సభ్యులు అసెంబ్లీకి హాజరు కావడం లేదు. అదే సమయంలో శాసనమండలిలో వైసీపీకి స్పష్టమైన మెజారిటీ ఉంది. దీంతో శాసనమండలికి మాత్రం హాజరవుతున్నారు. సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మండలిలో వైసీపీ పక్ష నేతగా ఉండడంతో వాడివేడిగా చర్చ నడుస్తోంది. పైగా తొలిసారిగా ఈరోజు పవన్ శాసనమండలిలో మాట్లాడేసరికి ప్రాధాన్యత సంతరించుకుంది. వైసిపి హయాంలో చోటు చేసుకున్న అక్రమాలతో పాటు గ్రామాల్లో ఉన్న మరో సమస్యపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు పవన్ స్పందించారు. ప్రతి 10 గ్రామాలకు ఒక డంపింగ్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేస్తున్నట్లు పవన్ తెలిపారు.
* చాలా దూకుడుగా
అయితే మండలిలో పవన్ చాలా దూకుడుగా మాట్లాడారు. వైసిపి ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేయడం ద్వారా 4800 కోట్ల రూపాయలు వృధా చేశారని చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించి ఖర్చులను సమగ్రంగా వివరించారు. ఒక వ్యూహం ప్రకారం ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేసినట్లు చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అన్ని పంచాయితీల్లో పనులు చురుగ్గా జరుగుతున్నాయి. పల్లె పండుగ పేరుతో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. వాటికి ₹4,500 కోట్ల రూపాయలు కేటాయించారు. అంటే వైసీపీ రంగుల ఖర్చుతో గ్రామాల స్వరూపమే మార్చేయవచ్చు అన్న సెటైర్లు పడుతున్నాయి.
* సత్ఫలితాలు ఇస్తున్న చర్యలు
పవన్ పాలనా సంస్కరణలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. అందుకే పవన్ విషయంలో కూటమిలో మంచి మార్కులే పడుతున్నాయి. ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి విషయంలో పవన్ తీసుకుంటున్న చొరవ కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తోంది. అదే సమయంలో వైసీపీ పై విరుచుకు పడటం లో కూడా పవన్ ముందు వరుసలో నిలుస్తున్నారు. మొత్తానికి అయితే పవన్ మండలిలో వైసిపి పై సెటైరికల్ గా విరుచుకుపడ్డారు. అదే ఇప్పుడు సోషల్ మీడియాలో హైలెట్ అవుతున్నాయి.