Deputy CM Pavan Kalyan : ఆది నుంచి చంద్రబాబు విషయంలో పవన్ కళ్యాణ్ సాఫ్ట్ గానే ఆలోచిస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం సమయంలో సైతం పవన్ యాక్టివ్ గా ఉండేవారు.దూకుడుగా ప్రకటనలు ఇచ్చేవారు.ఆ సమయంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ పైనే టార్గెట్ చేశారు పవన్.చంద్రబాబుపై ఆ స్థాయిలో విమర్శలు చేసేవారు కాదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు.. మధ్యలో చిన్నచిన్న విధానపరమైన విమర్శలే కానీ.. చంద్రబాబుపై ఎన్నడు వ్యక్తిగత కామెంట్స్ చేయలేదు. చంద్రబాబు కష్టంలో ఉన్న ప్రతిసారి అండగా నిలబడ్డారు. 2014లో జనసేన ను స్థాపించారు. జగన్ రూపంలో వైసిపి ఉన్నా.. నవ్యాంధ్రప్రదేశ్ కు తొలి సీఎంగా అనుభవజ్ఞుడైన చంద్రబాబు పదవి చేపట్టాలని ఆకాంక్షించారు. నాడు బే షరతుగా మద్దతు తెలిపారు. 2019 ఎన్నికల్లో ప్రత్యేక పరిస్థితుల్లో ఒంటరిగానే పోటీ చేశారు. కానీ వైసీపీ అధికారంలోకి రావడం, ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో తెలుగుదేశం పార్టీతో పొత్తుకు సంకేతాలు పంపారు. ఎన్నో రకాల అడ్డంకులు, ఇబ్బందులు వచ్చినా ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నారు. పొత్తు విఘాతం కలిగించేందుకు జరిగిన ప్రయత్నాలను అడ్డుకోగలిగారు. పొత్తు కోసం తనకు తాను సీట్లు తగ్గించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పటికీ చంద్రబాబుపై అదే అభిప్రాయంతో ఉన్నారు. ఆయన అనుభవాన్ని గౌరవిస్తున్నట్లు చెప్పారు. అటువంటి వ్యక్తి నాయకత్వంలో పనిచేసేందుకు తనకు ఎటువంటి సందేహం, సిగ్గు లేదని కూడా చెప్పుకొచ్చారు.
* అన్ని పంచాయితీల్లో గ్రామసభలు
రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో నేడు గ్రామసభలు జరిగిన సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబు తో పాటు డిప్యూటీ సీఎం పవన్, ఇతర మంత్రులు గ్రామసభల్లో పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం మైసూరు వారి పల్లెలో జరిగిన గ్రామసభలో పవన్ పాల్గొన్నారు. కీలక ప్రసంగం చేశారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర అభివృద్ధి తమ అభిమతం అన్నారు. గ్రామాలను అభివృద్ధి చేసుకోవడానికి ఇదో మంచి మార్గమన్నారు. గ్రామాలు పచ్చగా ఉంటేనే అందరం హాయిగా ఉంటామన్న విషయాన్ని గుర్తు చేశారు పవన్.
* పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యం
వైసిపి ప్రభుత్వం పంచాయితీరాజ్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందని పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే వాటిని బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో 13326 పంచాయితీలు బలపడితేనే రాష్ట్ర అప్పులన్నీ తీర్చగలం అని చెప్పుకొచ్చారు. అద్భుతాలు చేయడానికి తన చేతిలో మంత్రదండం లేదని.. నిబద్ధతతో పని చేయడం వల్ల కొంత సత్ఫలితాలు వస్తాయని.. మేం చేస్తున్నది అదేనని చెప్పుకొచ్చారు. చంద్రబాబు అనుభవం ఈ రాష్ట్రానికి చాలా అవసరమని చాలా సందర్భాల్లో చెప్పానని.. ఇప్పుడు కూడా అదే చెబుతున్నానని.. అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కించగలిగేది ఒక్క చంద్రబాబును అని తేల్చి చెప్పారు. లక్షలాదిమందికి ఒకటో తేదీనే పింఛన్లు అందించిన ఘనత చంద్రబాబుదేనని.. నాకంటే బాగా ఆలోచించగలిగే వాళ్ళ వెంట నడిచేందుకు నేనేమీ సంకోచించనని పవన్ చెప్పుకొచ్చారు.
* పదవి అలంకారం కాదు
అయితే ఇదే గ్రామ సభలో తన పదవి విషయం మరోసారి ప్రస్తావించారు పవన్. పదవి తనకు అలంకారం కాదని.. బాధ్యత అని చెప్పుకొచ్చారు. ప్రతి పంచాయతీకి సొంత భూమి ఉండాలన్నదే లక్ష్యం అన్నారు. అటువంటి ప్రభుత్వ భూములను గత ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని.. కొన్నిచోట్ల ఆక్రమణలు జరిగాయని చెప్పుకొచ్చారు పవన్. మైసూర్ వారి పల్లి పంచాయతీకి 10 సెంట్లు స్థలం అందించిన రైతు కారుమంచి నారాయణను ఈ సందర్భంగా పవన్ అభినందించారు. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ గ్రామ సభల కాన్సెప్ట్ విజయవంతం అయ్యింది. పంచాయితీల బలోపేతానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని పవన్ ప్రజలకు స్పష్టమైన సంకేతాలు పంపగలిగారు. అదే సమయంలో చంద్రబాబు నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరమని చెప్పడం ద్వారా సరికొత్త సంకేతాలను పంపే ప్రయత్నం చేశారు.