Pawan Kalyan Meet Chandrababu: ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపు కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం తరలింపు సంచలనంగా మారింది. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ సీరియస్ అయ్యారు. సీజ్ ది షిప్ అంటూ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా బియ్యం మాఫియా పై చర్యలు తీసుకోవాలని పవన్ గట్టిగానే కోరుతున్నారు. మరోవైపు ఏపీ నుంచి ముగ్గురు రాజ్యసభ సభ్యుల ఎంపికకు సంబంధించి సస్పెన్స్ కొనసాగుతోంది. వైసీపీకి బలం లేని నేపథ్యంలో కూటమి అభ్యర్థుల ఎంపిక లాంఛనమే.అయితే ఎవరిని ఎంపిక చేయాలి? ఏ పార్టీకి అవకాశం కల్పించాలి? అన్న దానిపై సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో డిప్యూటీ సీఎం పవన్ చంద్రబాబుతో భేటీ కానున్నారు. ఈ ఇద్దరి సమావేశం తర్వాత కీలక నిర్ణయాలు వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల పవన్ ఢిల్లీలో పర్యటించిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ తో పాటు కేంద్ర మంత్రులను సైతం కలిశారు. ఏపీకి సంబంధించి కీలక సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. ప్రాజెక్టులకు సంబంధించి చర్చలు జరిపారు. అటు నుంచి అటే వచ్చిన పవన్ నేరుగా కాకినాడ పోర్టుకు వెళ్లారు. సౌత్ ఆఫ్రికాకు బియ్యం తరలిస్తున్న నౌకను పరిశీలించారు.ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.వెంటనే కలుగ చేసుకోవాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు.మరోవైపు ఢిల్లీలోరాజ్యసభ స్థానాలకు సంబంధించి పవన్ కేంద్ర పెద్దలతో చర్చించినట్లు వార్తలు వచ్చాయి. ఈ పరిణామాల నడుమ చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అవుతుండడం.. ప్రాధాన్యత సంతరించుకుంది.
* నేడు చంద్రబాబు ఇంటికి పవన్
సీఎం చంద్రబాబు ఆహ్వానం మేరకు ఆయన ఇంటికి వెళ్ళనున్నారు పవన్ కళ్యాణ్. ఈ భేటీలో ఏం చర్చిస్తారన్నది హాట్ టాపిక్ అవుతోంది. ప్రధానంగా రాజ్యసభ సభ్యులకు సంబంధించి చర్చించనున్నారు. మూడు పార్టీలకు ఒక్కో సభ్యుడు ప్రతిపాదనలో మార్పులు జరిగాయి. రాజీనామా చేసిన ఇద్దరిలో బీద మస్తాన్ రావుకు టిడిపి నుంచి.. బిజెపి నుంచి ఆర్ కృష్ణయ్యను ఎంపిక చేయడం దాదాపు ఖరారు అయ్యింది. అయితే మూడో సీటు టిడిపికి విడిచి పెడతారా? లేకుంటే పవన్ విజ్ఞప్తి మేరకు నాగబాబుకు కేటాయిస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి మాత్రం భారీ స్థాయిలో ఆశావహులు ఉన్నారు. ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నట్లు తెలుస్తోంది.
* కీలక చర్చలు
ప్రధానంగా జనసేన నుంచి నాగబాబు పేరు పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. ఆయన ఎంపిక లాంచనమేనని టాక్ నడిచింది. కానీ ఒక్కసారిగా పరిణామాలు మారిపోయాయి. టిడిపికి రెండు, బిజెపికి ఒక పదవి ఇస్తారని తెలుస్తోంది. అయితే పవన్ పట్టుబడితే మాత్రం నాగబాబు కు ఛాన్స్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యత దక్కుతోంది. కచ్చితంగా రాజ్యసభ పదవులతో పాటు బియ్యం మాఫియా పై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు రేపు మంత్రివర్గ సమావేశం జరగనుంది. కీలక సంక్షేమ పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. అంతకంటే ముందే ఈ ఇద్దరు నేతలు పథకాలు, ఇతరత్రా సమస్యలు, రాజకీయ అంశాలపై చర్చలు జరపనున్నారు.