Chandrababu – Revanth Reddy : రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు గడుస్తోంది.కానీ ఇంతవరకు విభజన హామీలు అమలుకు నోచుకోలేదు. చాలా వాటికి పరిష్కారం దొరకలేదు. గత పదేళ్లుగా వివిధ కారణాలతో జాప్యం జరుగుతూ వచ్చింది. రకరకాల రాజకీయ కారణాలతో విభజన హామీలు అమలుకు నోచుకోలేదు. ఈ తరుణంలో తెలంగాణలో రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. ఏపీలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాయి. అయితే రాజకీయంగా రెండు ప్రభుత్వాల మధ్య వ్యత్యాసాలు ఉన్నా… చంద్రబాబుకు రేవంత్ అనుంగ శిష్యుడు కావడం కలిసి వచ్చే అంశం. ఈ తరుణంలో రెండు రాష్ట్రాల మధ్య సహృద్భావ వాతావరణం నెలకొంది. అందులో భాగంగా కొద్దిరోజుల కిందట ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హైదరాబాద్ వేదికగా సమావేశం అయ్యారు. పరస్పరం అభిప్రాయాలను పంచుకున్నారు. విభజన హామీల విషయంలో ఎలా ముందుకు వెళ్లాలో ప్రాథమిక స్థాయిలోనే చర్చలు జరిపారు. ఒకరికొకరు కీలక ప్రతిపాదనలు చేసుకొన్నారు. ఇటువంటి తరుణంలో ఈరోజు రెండో సమావేశం జరగనుంది. అయితే ముఖ్యమంత్రులు హాజరు కావడం లేదు. రెండు రాష్ట్రాల సీఎస్ ల ఆధ్వర్యంలో మంగళగిరిలో సమావేశం జరగనుంది. ఏపీ నుంచి వచ్చిన ప్రతిపాదనలపై తెలంగాణ ప్రభుత్వం తమ నిర్ణయాలను వెల్లడించనుంది. దీంతో ఈ సమావేశం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
* సిఎస్ ల భేటీ
మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో ఈ కీలక భేటీ జరగనుంది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం అమలు కావాల్సిన నిర్ణయాలపై చర్చించనున్నారు. రెండు రాష్ట్రాల మధ్య పరిష్కారం కాకుండా ఉన్న పెండింగ్ అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. వాస్తవానికి జూలై 5న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం అయ్యారు. తరువాత త్వరగా మరో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. కానీ వివిధ కారణాలతో ఈ సమావేశం జరగలేదు. ఈరోజు ఇరు రాష్ట్రాల సిఎస్లు సమావేశం కానున్నారు. కీలక నిర్ణయం తీసుకోనున్నారు. రెండు రాష్ట్రాలకు మేలు చేసే విధంగా నిర్ణయాలు ఉండాలని ఇప్పటికే సూత్రప్రాయంగా చెప్పుకున్నారు. దీంతో తాజా భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.
* విద్యుత్ బకాయిలపై చర్చ
అప్పట్లో ముఖ్యమంత్రుల సమావేశంలో తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన విద్యుత్ బకాయిల్లో.. కేంద్రం 2000 కోట్లకు పైగా నిధులను విడుదల చేసింది. ఇంకా ఈ నిధులు రావాల్సి ఉంది. దీనిపై ఈ సమావేశంలో చర్చించే ఛాన్స్ కనిపిస్తోంది. మొత్తం 7200 కోట్ల రూపాయల బకాయిలపైన నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు ఇప్పటికే రేవంత్ ను కోరారు. దీనిపైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఉద్యోగుల విభజనపై కూడా ఒక నిర్ణయానికి వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికైతే ఇరు రాష్ట్రాల సిఎస్ ల నేతృత్వంలో అధికారుల భేటీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.