Indigo Airlines : ఏపీలో విమానయాన సర్వీసులు మరింత అందుబాటులోకి వస్తున్నాయి. కేంద్ర మంత్రివర్గంలో ఏపీకి ప్రాతినిధ్యం దక్కిన సంగతి తెలిసిందే. కీలకమైన పౌర విమానయాన శాఖను కింజరాపు రామ్మోహన్ నాయుడు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో రాష్ట్రంలో విమానాశ్రయాల ఏర్పాటు వేగవంతంగా జరుగుతోంది. ఇంకోవైపు విమాన సర్వీసులు సైతం అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా రెండు విమాన సేవలు అందుబాటులోకి వచ్చాయి. తిరుపతి నుంచి ముంబాయికి విమాన సర్వీసులు నడపాలన్న విన్నపం ఉండేది.మరోవైపు రాజమండ్రి నుంచి ముంబాయి విమానాలను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఇండిగో సంస్థ సర్వీసులను ప్రారంభించింది. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఈ రెండు విమానాల సమయాన్ని అధికారులు తాజాగా వెల్లడించారు. దేశ ఆర్థిక రాజధానిగా ముంబై ఉంది. వ్యాపార వాణిజ్య అవసరాలకు నిత్యం అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. అటువంటి వారికి ఈ విమానాలు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు రామ్మోహన్ నాయుడు. కేవలం ఏపీ ప్రజల కోసమే ఈ రెండు సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు. అదే సమయంలో తిరుమల భక్తులకుఈ విమాన సర్వీసులు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. ముంబై మీదుగా విదేశాలకు వెళ్లే ఉమ్మడి గోదావరి జిల్లా ప్రజలకు, తిరుమల బాలాజీ ఆలయానికి చేరుకునే భక్తులకు ఇది ఎంతో ప్రయోజనం అని వివరించారు.
* టైమింగ్స్ ఇవే
రాజమండ్రి -ముంబై- రాజమండ్రి(6e 582/3),తిరుపతి- ముంబై- తిరుపతి (6e 532/3) మధ్య కొత్తగా ఈ సర్వీస్ లు ప్రారంభం అయ్యాయి. ముంబై నుంచి ఉదయం 5:30 గంటలకు బయలుదేరి 7.15 గంటలకు తిరుపతి చేరుకుంటుంది ఈ విమానం.తిరుపతి నుంచి ఉదయం 7:45 గంటలకు బయలుదేరి 9 25 గంటలకు చేరుకుంటుంది విమానం. వారంలో ఏడు రోజులు పాటు ఈ సేవలు అందుబాటులో ఉంటాయని ఇండిగో సంస్థ వెల్లడించింది. తిరుపతి నుంచి ముంబైకి నేరుగా విమానం ఏర్పాటు చేయాలని చాలా రోజులుగా డిమాండ్ ఉంది. మహారాష్ట్ర తో పాటు ఇతర దేశాల నుంచి ముంబై మీదుగా తిరుపతి వచ్చే శ్రీవారి భక్తులకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది.
* త్వరలో మరిన్ని సేవలు
అయితే మన దేశంలో వివిధ విమానాశ్రయాల నుంచి విమాన సర్వీసులను పెంచే యోచనలో చాలా కంపెనీలు ఉన్నాయి. అయితే ఇండిగో సంస్థ అయితే తక్కువ ధరలకు టికెట్లు ఉంటాయన్న కారణంతో.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ప్రత్యేకంగా చొరవ చూపుతున్నారు. ఇంకోవైపు రాష్ట్రంలో విమానాశ్రయాల ఏర్పాటు విషయంలో కూడా చాలా చొరవ తీసుకుంటున్నారు. కేవలం ఏపీ ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు కొత్తగా ఈ రెండు విమాన సర్వీసులు ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఆదరణ,ఆక్యుపెన్సి చూశాక ఇతర విమానయాన సంస్థలు తమ సర్వీసుల ప్రారంభం పై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.