Pavan kalyan : పవన్ కళ్యాణ్ మొన్నటి వరకు ఒక ఫెయిల్యూర్ నాయకుడు. నేడు మాత్రం నాయకుల్లో ఆయన ఒక ప్రత్యేకం. ట్రెండ్ క్రియేట్ చేయడమే కాదు.. సెట్ చేయడం కూడా వచ్చు అని చేసి చూపించారు. సినీ రంగంలో కూడా పవన్ స్టైల్ వేరు.ఆయన వ్యవహార శైలి వేరు. చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనకంటూ ఒక శైలి, ప్రతిభ, కష్టంతో పవర్ స్టార్ గా ఎదిగారు. వైవిధ్యమైన సినిమాలు, పాత్రలు, కొత్తదనం కోసం తపన వంటివి ఆయననుసినీ పరిశ్రమలో నిలబెట్టాయి.వరుసగా డిజాస్టర్లు పలుకరించినా స్టార్ డం కోల్పోని ఒకే ఒక హీరో పవన్ కళ్యాణ్. మిగతా హీరోలతో పోల్చితే పవన్ లో ఎన్నో అంశాలు విభిన్నంగా ఉంటాయి. సమాజం బాగుండాలి, అందుకోసం తాను చేయగలిగినది చేస్తానని లక్షణం ఎంతో ప్రత్యేకమైనది. పవన్ కు ఈ స్థాయికి తెచ్చింది కూడా అదే. సినీ పరిశ్రమలో లైట్ బాయ్ నుంచి నిర్మాత వరకు అందర్నీ సమానంగా చూడడం ఒక్క పవన్ కళ్యాణ్ కే సాధ్యం. సినీ జీవితంలో కూడా ఆర్భాటాలకు దూరంగా ఉండేవారు. సినిమా రంగంలో ఏ విధంగా వ్యవహరించారో.. ఏ పరిస్థితి ఎదురైందో.. రాజకీయరంగంలో కూడా అదే స్థితిని ఎదుర్కొన్నారు పవన్ కళ్యాణ్. పార్టీని ఏర్పాటు చేసి సుదీర్ఘకాలం పోరాడారు. ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేశారు. ప్రజలు ఆదరించే వరకు వారి మనసును గెలిచేందుకు పాటు పడ్డారే తప్ప.. ఎన్నడూ జనాలను ధ్వేషించలేదు. తనను ఆదరించలేదని నిట్టూర్పులకు పోలేదు. ప్రజలపై నిందలు వేయలేదు.
* సమాజానికి మంచి చేయాలనే తపన
సమాజానికి మంచి చేయాలన్న ఆలోచనతో పవన్ రాజకీయాల్లోకి వచ్చారు. అప్పటికప్పుడే అధికారంలోకి రావాలని భావించలేదు. మార్పు ద్వారా మాత్రమే ప్రజల్లోకి వెళ్లాలని బలంగా భావించారు. కానీ అది మిగతా సమాజానికి ఫెయిల్యూర్ నాయకుడిగా చూపించింది. సినీ గ్లామర్ తో కోట్లాదిమంది అభిమానాన్ని కొల్లగొట్టిన ఆయన.. ప్రజాక్షేత్రంలో మాత్రం ప్రజల మనసు గెలవడానికి దాదాపు 10 ఏళ్లు పట్టింది. ప్రజారాజ్యం గుణపాఠాలతో కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. దానిని జనసేన గా మార్చారు. ఓటమితో ప్రస్థానం ప్రారంభించి.. అవమానాలను అధిగమించి.. విజయాలను అందుకున్న ఒకే ఒక్క హీరో, నాయకుడు పవన్ కళ్యాణ్.
* ప్రజల్లో ఒక రకమైన అభిప్రాయం
యువతను, అన్ని వర్గాల ప్రజలను ఆలోచింపజేశారు పవన్. తన మీద ప్రజలకు ఉన్న అభిప్రాయాన్ని మార్చగలిగారు. తన ఆశయాలు, నమ్మిన సిద్ధాంతాలను ప్రజల ముందు ఉంచి వారి నమ్మకాన్ని పొందగలిగారు. దాదాపు 10 ఏళ్ల పోరాటం తర్వాత జనసేన ఇప్పుడు అధికారాన్ని అనుభవిస్తుంది. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం తో పాటు ఆరు కీలక మంత్రిత్వ శాఖలను నిర్వర్తిస్తున్నారు.
* పవర్ పాలిటిక్స్ కు దూరంగా
పవన్ పవర్ పాలిటిక్స్ కు పదేళ్లు దూరంగా ఉన్నారు. ఒక్క పదవి చేపట్టలేదు. డబ్బులు ఖర్చు కూడా పెట్టలేదు. అయినా సరే ప్రజలు ఆయన సభలకు వస్తున్నారంటే.. ఆయన చరిష్మా అటువంటిది. అన్నింటికీ మించి ఆయన ఆశయాలు గొప్పవి. లేకుంటే అందరి స్టార్ల మాదిరిగానే ఆయనను ప్రజలు చూసేవారు. చప్పట్లు కొట్టేవారు. సాగనంపేవారు. ప్రారంభంలో పవన్ ను సాధారణ స్టార్ గానే ప్రజలు చూశారు. కానీ ఆయన ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలు చూసి ఇప్పటికీ జై కొడుతున్నారు. ఇది నిజాయితీ, నిబద్ధతతో పవన్ ముందుకెళ్తే దేశంలోనే పవన్ ఒక గర్వించే నాయకుడిగా ఎదగడం ఖాయం.