https://oktelugu.com/

Pawan Kalyan: ఆ ముగ్గురిని చూసి పవన్ నేర్చుకోవాలి

ఏపీ సీఎం జగన్ సైతం చాలా కష్టపడుతున్నారు. వైసీపీని రెండోసారి అధికారంలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు.

Written By:
  • Dharma
  • , Updated On : March 3, 2024 / 02:06 PM IST

    Pawan Kalyan

    Follow us on

    Pawan Kalyan: రాజకీయాలు చేయడం చాలా కష్టం. రాజకీయ పార్టీలు నడపడం ఇంకా కష్టం. అందునా ప్రాంతీయ పార్టీల మనుగడ మరి ఎంతో కష్టం. అందుకే పార్టీలు ఏర్పాటు చేసి సక్సెస్ సాధించిన వారు చాలా తక్కువ. ఇలా పార్టీలు స్థాపించి మరో జాతీయ పార్టీలో విలీనం చేయడమే అధికం. అయితే ఈ విషయంలో జనసేన అధినేత పవన్ ను అభినందించాల్సిందే. పార్టీ ఏర్పాటు చేసి సుదీర్ఘకాలం అవుతున్నా సరైన విజయం ఇంతవరకు దక్కలేదు. అయినా సరే పార్టీని తన స్వశక్తితో నడుపుతున్నారు. అయితే పార్టీని నడిపించడం ఆయనకు సంతృప్తి ఇవ్వచ్చు కానీ.. సగటు జన సైనికుడు మాత్రం సంతృప్తిగా లేడు. అధినేతలో మార్పు రావాలని కోరుకుంటున్నాడు. ఆ ముగ్గురు నేతలను గుర్తు చేసుకుంటున్నారు.

    ప్రధాని నరేంద్ర మోడీ ఎంతగానో కష్టపడుతున్నారు. కేంద్రంలో మూడోసారి ఎన్డీఏను అధికారంలోకి తీసుకురావడానికి ఆయన చేయని ప్రయత్నం అంటూ లేదు. అహోరాత్రులు శ్రమిస్తున్నారు. రోజుకు 16 గంటల వరకు పనిచేస్తున్నారు. నిత్య పర్యటనలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. రాష్ట్రాల పర్యటనలు, అభ్యర్థుల ఎంపిక, జాతీయస్థాయిలో కూటమి సమన్వయం వంటి వాటిలో పగలు, రాత్రి కష్టపడుతున్నారు. నిత్యం కసరత్తులకే సమయం కేటాయిస్తున్నారు.

    ఏపీ సీఎం జగన్ సైతం చాలా కష్టపడుతున్నారు. వైసీపీని రెండోసారి అధికారంలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఒకవైపు ప్రభుత్వాన్ని నడిపిస్తూనే.. మరోవైపు పార్టీపై ఫోకస్ పెట్టారు. తీవ్ర మదింపు చేసి అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. ఇప్పటివరకు 9 జాబితాలను ప్రకటించారు. దాదాపు 80 మంది వరకు సిట్టింగ్లను మార్చారు. అసంతృప్తులను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పాలనా వ్యవహారాలు.. అక్కడ నుంచి పార్టీ వ్యవహారాలను చక్కబెడుతున్నారు. అర్ధరాత్రి వేళల్లో, ఉదయం సమయాల్లో సైతం ఈ కసరత్తు జరుగుతోంది. అంటే సీఎం జగన్ సైతం 16 నుంచి 18 గంటలు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.

    చంద్రబాబు సైతం తన వయసుకు మించి కష్టపడుతున్నారు. ఈసారి ఎలాగైనా టిడిపిని అధికారంలోకి తేవడానికి ఆయన చేయని ప్రయత్నం అంటూ లేదు. ఏడుపదుల వయసులో శక్తికి మించి కష్టపడుతున్నారు. జనసేన తో పొత్తు, సీట్ల సర్దుబాటు, అసంతృప్త నేతలకు బుజ్జగింపులు.. ఇలా ఒకటేమిటి.. అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. ఆయన సైతం రోజుకు 18 గంటల వరకు పనిచేస్తున్నట్లు టిడిపి వర్గాలు చెబుతున్నాయి. మరి ఆ స్థాయిలో పవన్ వర్క్ చేస్తున్నారా? అన్న ప్రశ్న ఎదురవుతోంది. రాజకీయాలు అన్నాక వ్యూహాలు, ప్రతి వ్యూహాలు ఉంటాయి. దానికి విలువైన సమయం కేటాయించాల్సి ఉంటుంది. మరి జనసేనాని విషయంలో అదే లోపం అన్నట్లు తెలుస్తోంది. అయితే పవన్ సైతం అటు సినిమా, ఇటు రాజకీయ రంగంలో ఉండడంతో బిజీ షెడ్యూల్ తో గడుపుతున్నారు. మిగతా నాయకులతో పోల్చితే విలువైన సమయం రాజకీయాల కోసం కేటాయించడం కుదరని పని.