Pawan Kalyan
Pawan Kalyan: ఒకవైపు పొత్తులతో దూకుడు మీద ఉన్న కూటమి.. సీట్ల సర్దుబాటు విషయంలో సైతం సానుకూలంగా ముందుకు సాగుతోంది. వివాదాలు ఉన్నచోట పరిష్కార మార్గాన్ని వెతుకుతోంది. అసంతృప్తులను బుజ్జగిస్తోంది.ముఖ్యంగా టిడిపి, జనసేనల మధ్య సానుకూల దృక్పథం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు బిజెపి విషయంలో సైతం ఆ రెండు పార్టీలు అదే ధోరణితో వ్యవహరిస్తున్నాయి. ప్రస్తుతం విజయవాడ కేంద్రంగా మూడు పార్టీల కీలక నేతల మధ్య చర్చలు నడుస్తున్నాయి. ఈ సాయంత్రానికి కొలిక్కి రానున్నాయి. ఆ ప్రక్రియ పూర్తయిన వెంటనే మూడు పార్టీల అభ్యర్థుల ప్రకటన వస్తుంది. ఈ నేపథ్యంలో టిడిపి, జనసేన మధ్య ఓ నియోజకవర్గంలో నెలకొన్న వివాదం పరిష్కార మార్గం దొరికింది.
పొత్తులో భాగంగా జనసేనకు 24 అసెంబ్లీ స్థానాలు, మూడు పార్లమెంట్ స్థానాలు కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని కీలక నియోజకవర్గాల్లో సీట్ల సర్దుబాటు ఇబ్బందికరంగా మారుతోంది . అటువంటి వాటిలో రాజమండ్రి రూరల్ స్థానం ఒకటి. ఈ నియోజకవర్గాన్ని రెండు పార్టీలు బలంగా కోరుకున్నాయి. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నారు. ఈయన టిడిపిలో సీనియర్ నేత. పార్టీ వ్యవస్థాపక సభ్యుడు కూడా. టిడిపిలో సిట్టింగ్ లందరికీ టిక్కెట్లు ఇస్తామని ఇదివరకే చంద్రబాబు ప్రకటించారు. ఈ లెక్కన ఈ సీటుపై బుచ్చయ్య చౌదరి ఆశలు పెట్టుకున్నారు. పోటీకి సన్నాహాలు చేసుకుంటున్నారు.
ఇదే నియోజకవర్గంలో జనసేనకు కీలక నేతగా కందుల దుర్గేష్ ఉన్నారు. ఈయన జనసేన జిల్లా అధ్యక్షుడు కూడా. గత ఐదు సంవత్సరాలుగా పనిచేసుకుంటున్నారు. పొత్తులో భాగంగా తనకే టికెట్ లభిస్తుందని ఆశించారు. అటు పార్టీ సమావేశంలో సైతం పవన్ దుర్గేష్ పోటీ చేస్తారని తేల్చేశారు. దీంతో రెండు పార్టీల మధ్య ఇదో జఠిల అంశంగా మారిపోయింది. పెద్ద ఎత్తున వివాదం నడిచింది.రెండు పార్టీలకు అంతర్గత సమస్యగా మారింది. దీంతో చంద్రబాబు, పవన్ లు కలుగ చేసుకోవాల్సి వచ్చింది. పార్టీ వ్యవస్థాపక సభ్యుడుగా ఉన్న బుచ్చయ్య చౌదరి విషయంలో మినహాయింపు ఇవ్వాలని చంద్రబాబు కోరినట్లు సమాచారం. అయితే ఇదే విషయంపై స్పందించిన పవన్ దుర్గేష్ కు పక్కనే ఉన్న నిడదవోలుకు వెళ్లాలని సూచించినట్లు వార్తలు వచ్చాయి. అయితే అందుకు దుర్గేష్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు కూడా ప్రచారం జరిగింది. అయితే ఆ నియోజకవర్గంలో ఇప్పుడు కీలక అప్డేట్ వచ్చింది. జనసేన హై కమాండ్ నిడదవోలు జనసేన అభ్యర్థిగా కందుల దుర్గేష్ ను ప్రకటించింది. దీంతో ఈ సమస్య ఒక కొలిక్కి వచ్చినట్లు అయింది. గోరంట్ల బుచ్చయ్య చౌదరికి రాజమండ్రి రూరల్ క్లియర్ అయింది. ఇక రెండో జాబితా విషయంలో ఇదే తరహాగా ముందుకు సాగాలని రెండు పార్టీలు నిర్ణయించుకోవడం విశేషం.