Pawan Kalyan : ఏపీలో ఘనవిజయం సాధించిన తర్వాత.. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి అడుగులు వేగంగా పడుతున్నాయి. మంగళవారం ఫలితాలు వెలువడిన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ క్రమంలోనే మంత్రివర్గ కూర్పు పై చర్చించారు. అయితే ఇవి ప్రాథమిక దశలోనే ఉన్నాయని.. సుదీర్ఘ బేటి తర్వాతే ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం లాంచనమైనప్పటికీ.. కీలకమైన మంత్రిత్వ శాఖలు ఎవరికి దక్కుతాయనేది ఆసక్తికరంగా మారింది. అయితే పవన్ కళ్యాణ్ తండ్రి కానిస్టేబుల్ కావడం.. పలు సందర్భాల్లో తనకు పోలీసు వృత్తి అంటే ఇష్టం ఉందని పవన్ కళ్యాణ్ చెప్పడంతో.. ఆయన హోం మంత్రిత్వ శాఖ తీసుకుంటారని ప్రచారం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ కు హోం మంత్రిత్వ శాఖ అంటే ఇష్టం లేదట. తనకు పర్యావరణ కాలుష్య నివారణ పై పనిచేయాలని ఉందట. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ ఓ జాతీయ మీడియా ఛానల్ తో పంచుకున్నారు..
” కాలుష్యం అనేది అత్యంత ప్రమాదకరమైనది. మనిషి జీవితాన్ని నాశనం చేస్తోంది. దీనివల్ల వాతావరణంలో అనేక రకాల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కాలుష్య స్థాయి రోజురోజుకు పెరుగుతుండడం వల్ల అకాల వర్షాలు, అకాల కరువు కాటకాలు చోటుచేసుకుంటున్నాయి. వీటన్నిటిని నివారించాలంటే పర్యావరణాన్ని పరిరక్షించాలి. అటు వ్యవసాయం, రైతులకు ఉపయుక్తంగా నిలిచే ఇరిగేషన్ శాఖపై పనిచేయాలని ఉందని” పవన్ కళ్యాణ్ తన ఆసక్తులను వివరించారు.
పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాత్రమే కాదు గతంలోనూ తనకు పర్యావరణం పై ఉన్న ఆసక్తిని పలు సందర్భాల్లో ప్రదర్శించారు.. హైదరాబాదులో ఉన్న ఫామ్ హౌస్ లో గోవులను పెంచుతుంటారు. మామిడి తోటలను సంరక్షిస్తుంటారు. సేంద్రీయ విధానంలో పండిన మామిడి పండ్లను తోటి సినీ కళాకారులకు పవన్ కళ్యాణ్ పంపిస్తుంటారు. ఆయన తినే ఆహారం కూడా సేంద్రియే విధానంలో తయారైనదే. ప్లాస్టిక్, కాలుష్యానికి దూరంగా ఉండే జీవనాన్ని ఆయన ఇష్టపడతారు. పర్యావరణం, వ్యవసాయ శాఖలు అంటే తనకు ఇష్టమని పవన్ కళ్యాణ్ చెప్పిన నేపథ్యంలో.. ఆయన అభిమానులు సోషల్ మీడియాలో అభినందనలతో ముంచెత్తుతున్నారు.