Actress Hema : క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన హేమ సినిమా కెరియర్ ప్రమాదంలో పడింది.. ఇటీవల బెంగళూరులో రే* పార్టీ, మాదకద్రవ్యాల కేసులో ఆమె తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు. అందులో ఆమె పాల్గొన్నట్టు, బెంగళూరు పోలీసులు కీలక ఆధారాలు చూపించడంతో ఒక్కసారి నిందితురాలైపోయారు. వాస్తవానికి ఆ వ్యవహారంతో తనకు సంబంధం లేదని హేమ చెప్పారు. అందుకు సంబంధించి ఒక వీడియో కూడా విడుదల చేశారు. ఆ మరుసటి రోజు తన ఇంట్లో చికెన్ బిర్యాని వండుతూ కనిపించారు. కొద్ది రోజులకు మామిడికాయ పచ్చడి పెట్టే విధానం ఇదీ అంటూ మరొక వీడియోతో సందడి చేశారు. ఇలా ఎన్ని రకాల జిమ్మిక్కులకు పాల్పడినప్పటికీ బెంగళూరు పోలీసులు ఊరుకోలేదు. చివరికి ఆమె శరీరంలో రక్త నమూనాలను పరిశీలించి.. మాదకద్రవ్యాలు తీసుకున్నట్టు నిర్ధారించారు.
రే* పార్టీకి సంబంధించిన కేసు హై ప్రొఫైల్ పరిధిలోది కావడం, మీడియా, సోషల్ మీడియాలో దీని గురించి విస్తృతంగా వార్తలు ప్రసారం కావడంతో కర్ణాటక ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ఈ వ్యవహారంలో ఎంతటి వారు ఉన్నా వదిలిపెట్టకూడదని పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ కేసును విచారిస్తోంది. రే* పార్టీ, మాదకద్రవ్యాల కేసులో ఇప్పటికే 70 మంది అనుమానితులను పోలీసులు నిందితుల జాబితాలో చేర్చారు. అందులో శరీర రక్త నమూనాలలో పాజిటివ్ గా తేలిన వారిపై కేసులు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు..” రే* పార్టీ నిర్వహించింది ఎవరు? మాదకద్రవ్యాలు సరఫరా చేసింది ఎవరు? ఆరోజు పార్టీలో ఎవరెవరున్నారు? ఎలాంటి కార్యకలాపాలకు పాల్పడ్డారు? గతంలో ఇలాంటి పార్టీలకు ఎప్పుడైనా హాజరయ్యారా? ఈ పార్టీకి హాజరయ్యేందుకు ఎంత చెల్లించారు? ఈ పార్టీ నిర్వాహకులు మీకు ఎలా పరిచయం? అనే కోణాలలో పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
రే* పార్టీ, మాదకద్రవ్యాల కేసులో హేమ అరెస్టు అయిన నేపథ్యంలో.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి ఆమెను సస్పెండ్ చేస్తారని తెలుస్తోంది. ” మా” లో ఆమె సభ్యత్వాన్ని కూడా రద్దు చేసే యోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై మా అధ్యక్షుడు మంచు విష్ణు అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. వాస్తవానికి ఈ పార్టీలో తాను లేనని, ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్నానని చెప్పిన హేమ.. ఆ తర్వాత ఈ కేసులో అరెస్టు కావడంతో.. అంతకుముందు ఆమె వెల్లడించినవన్నీ అబద్ధాలేనని తేలిపోయింది.. ప్రస్తుతం హేమ బెంగళూరులోని పరపణ అగ్రహార జైల్లో విచారణ ఖైదీగా ఉన్నారు.