Pawan Kalyan Vs Opposition Leaders: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( deputy CM Pawan Kalyan) నటించిన హరిహర వీరమల్లు సినిమా చుట్టూ ఇప్పుడు వివాదాలు నడుస్తున్నాయి. ముఖ్యంగా రాజకీయ ప్రత్యర్థులు ఈ సినిమాను టార్గెట్ చేస్తున్నారు. మరోవైపు ఈ సినిమా వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. మంచి కలెక్షన్లు సాధిస్తోంది. అయితే ఈ సినిమాను టార్గెట్ చేసుకుంది వైసీపీ సోషల్ మీడియా. నేరుగా వైసిపి నేతలే రకరకాలుగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. అంబటి రాంబాబు అయితే వ్యంగ్యంగా సినిమా హిట్ కావాలని ఆకాంక్షిస్తూనే.. ఈ సినిమా పై అనేక రకాల వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. అయితే ఈ సినిమా టికెట్ల ధర పెంపునకు సంబంధించి అనుమతులు పై కూడా వైయస్సార్ కాంగ్రెస్ నేతలు రాద్ధాంతం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉంటూ ప్రభుత్వం నుంచి ఈ అనుమతులు ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మరికొందరైతే మంత్రివర్గం నుంచి పవన్ కళ్యాణ్ బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయకుమార్ ఇదే తరహా డిమాండ్ చేశారు. రాజ్యాంగం లోని మూడవ షెడ్యూల్లో ప్రజాప్రతినిధులు, మంత్రులు ప్రమాణస్వీకారం సమయంలో చేసిన వాగ్దానాలను, పాటించాల్సిన నిబంధనలు ఏపీలో కావడం లేదని ఆరోపించారు. తద్వారా పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు.
Also Read: గెలుపు తనదని ఇంగ్లాండ్ అనుకుంది.. అదే మ్యాచ్ ను ఇండియా వైపు తిప్పింది!
* అదే పనిగా ప్రచారం..
ప్రస్తుతం కీలక మంత్రిత్వ శాఖలతో పాటు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు పవన్ కళ్యాణ్. అయితే ఆయన తన శాఖల నిర్వహణను వదిలేసి సినిమాలు తీయడాన్ని వైసీపీ నేతలు( YSR Congress party leaders) తప్పు కొడుతున్నారు. అయితే ఏ చిత్ర పరిశ్రమలో అయినా ప్రభుత్వం నుంచి అనుమతులు పొంది సినిమా టిక్కెట్ల పెంపు అనేది ఆనవాయితీగా వస్తోంది. హరిహర వీరమల్లు సినిమాలో హీరోగా పవన్ ఉన్నా.. ఆ చిత్రంలో కో ఆర్టిస్టులు ఉన్నారు. అన్ని విభాగాలకు చెందిన ప్రతినిధులు ఉన్నారు. ఒక సినిమాపై ఆధారపడి వేలాదిమంది బతుకుతుంటారు. అటువంటి సినిమా విషయంలో ప్రత్యేక అనుమతులు తీసుకొని టిక్కెట్ల ధర పెంపు అనేది తప్పు కాదనేది మెజారిటీ ప్రజల అభిప్రాయం. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అదే పనిగా పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తున్నారు.
* ఆ నిబంధన అమలవుతోందా?
మంత్రులుగా ఉండేవారు ఇతర వృత్తుల్లో కొనసాగకూడదన్న నిబంధన కఠినంగా అమలు చేస్తే మంచిదే. అలా అయితే చాలామంది వ్యాపారాలు పెట్టారు. కుటుంబ సభ్యుల పేరుతో పరిశ్రమలు ఉన్నాయి. అంతెందుకు జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy) రాజకీయ నాయకుడిగా కొనసాగుతూ పరిశ్రమలు ఏర్పాటు చేయలేదా? మీడియా సంస్థలను నడపడం లేదా? కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు అవేవీ కనిపించడం లేదు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ తన సినిమాల ద్వారానే ఇంతటి క్రేజ్ సంపాదించుకున్నారు. సినిమాల ద్వారా వచ్చిన ఆదాయం తోనే పార్టీని నడిపారు. అయితే సినిమాల ద్వారా పవన్ కళ్యాణ్ కు వచ్చిన ఇమేజ్ను డామేజ్ చేసేందుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి ప్రయత్నాలు చేస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి.
* విజయ్ కుమార్ వెనుక వైసిపి..
అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు ఇతర పార్టీల నాయకులు ఎంత ప్రయత్నాలు చేసినా పవన్ కళ్యాణ్ ఇమేజ్ను డామేజ్ చేయలేరన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ( Liberation Congress Party) అధ్యక్షుడు విజయ్ కుమార్ వెనుక కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హస్తం ఉందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. సినిమాలే తనకు జీవనోపాధి అంటున్న పవన్ కళ్యాణ్.. భారత ప్రభుత్వం ఇచ్చిన ప్రవర్తన నియమావళిని పట్టించుకోవడంలేదని.. మంత్రి పదవి చేపట్టే ముందు వ్యాపారాలు, ఇతర ఆదాయ మార్గాల్లో భాగస్వామ్యంగా ఉండకూడదు అనే నిబంధన పవన్ కళ్యాణ్ కు తెలియదా అని ప్రశ్నిస్తున్నారు. ఆదాయం కోసం సినిమాల్లో నటిస్తున్నానని చెప్పిన పవన్ కళ్యాణ్.. తన తప్పును బహిరంగంగానే అంగీకరించారని విజయ్ కుమార్ తేల్చి చెప్పారు. అందుకే పవన్ కళ్యాణ్ ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అయితే దీనిపై జనసేన ఎలా స్పందిస్తుందో చూడాలి.