Pawan Kalyan Razole visit: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( AP deputy CM Pawan Kalyan ) పర్యటనలో అపరిచిత వ్యక్తుల సందర్శనకు సంబంధించి ఎప్పటికప్పుడు లోపాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. గతంలో మన్యంలో పర్యటించిన సమయంలో సైతం ఇలానే పరిస్థితి ఎదురయింది. అప్పట్లో పార్వతీపురం మన్యం జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన సమయంలో ఓ అపరిచిత వ్యక్తి హల్చల్ సృష్టించాడు. తర్వాత అది వివాదాస్పదంగా మారింది. పవన్ కళ్యాణ్ అభిమాని అని తేలడంతో విడిచిపెట్టారు. అయితే మరోసారి ఇప్పుడు రాజోలులో సైతం అపరిచిత వ్యక్తి పవన్ కళ్యాణ్ కు అతి దగ్గరగా మెలిగినట్లు డిప్యూటీ సీఎం కార్యాలయ భద్రత సిబ్బంది గుర్తించారు. అదే విషయాన్ని బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీకి నివేదిక రూపంలో అందించారు. ప్రస్తుతం జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. రాజోలు పర్యటన వివరాలను ఆరా తీస్తున్నారు. అనుమానిత వ్యక్తి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాడిగా గుర్తించినట్లు సమాచారం.
అత్యంత చేరువలో ఆ వ్యక్తి..
ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజోలు నియోజకవర్గంలో పర్యటించారు. కోనసీమ జిల్లాలో ఉప్పు నీటితో కొబ్బరి రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులను స్వయంగా తెలుసుకునేందుకు రాజోలు వచ్చారు. రోజంతా చురుగ్గా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే పవన్ కళ్యాణ్ కు చేరువలో ఒక వ్యక్తి తిరిగినట్లు భద్రతా సిబ్బంది గుర్తించారు. ఆయన కదలికలపై కన్నేసిన భద్రతా సిబ్బంది.. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీకి నేరుగా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆ వ్యక్తి చాలా దగ్గరగా పవన్ కళ్యాణ్ కు తచ్చడినట్లు సమాచారం. ఆయన కదలికలు సైతం అనుమానాస్పదంగా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో మన్య ప్రాంతంలో పవన్ కళ్యాణ్ పర్యటన సమయంలో భద్రతా సిబ్బంది రూపంలో ఒక వ్యక్తి అప్పట్లో హల్చల్ చేశారు. ఆ ఘటన మరువక ముందే మరోసారి ఇప్పుడు అదే పరిస్థితి ఎదురయ్యింది. దీంతో అంత ఆందోళన నెలకొంది.
పోలీసుల దర్యాప్తు..
రాజోలు పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ శంకరగుప్తం డ్రెయిన్ మూలంగా దెబ్బతిన్న కొబ్బరి తోటలను పరిశీలించారు. అక్కడ పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ సందర్భంలో సదరు వ్యక్తి పవన్ కళ్యాణ్ కు సమీపంలో సంచరించినట్లు తెలుస్తోంది. అయితే అతడు వైసిపి కార్యకర్త అని డిప్యూటీ సీఎం కార్యాలయానికి సమాచారం వచ్చింది. దీంతో అధికారులు అతని వ్యవహార శైలి, కదలికలపై అనుమానం వ్యక్తం చేస్తూ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అయితే ఆరోజు ఆయనకు పాస్ ఎలా జారీ అయింది? పవన్ కళ్యాణ్ కు ఎలా దగ్గరగా వచ్చారు? ఎవరు సాయం చేశారు అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.