Pawan Kalyan: ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఎన్నికల సమీపిస్తున్న కొలది అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో హై టెన్షన్ పొలిటికల్ హీట్ నెలకొంది.ముఖ్యంగా ముద్రగడ చుట్టూ రాజకీయాలు తిరుగుతుండడం విశేషం.ముద్రగడ తన కుటుంబ సభ్యులతో కలిసి వైసీపీలో చేరుతారని ప్రచారం జరిగింది. అందుకు బలం చేకూరుస్తున్నట్లు చాలా పరిణామాలు చోటుచేసుకున్నాయి.సరిగ్గా ఇదే సమయంలో కీలక ట్విస్ట్. నేరుగా జనసేన కీలక నాయకులు వచ్చి ముద్రగడతో చర్చలు జరపడం విశేషం.
ఏపీలో అధికారంలోకి రావాలంటే గోదావరి జిల్లాలే కీలకం. అక్కడ ఎవరికి పట్టు చిక్కితే వారి అధికారంలోకి వస్తారు. తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు పెట్టుకుంది. గోదావరి జిల్లాల్లో ఏకపక్ష విజయం సాధించాలని డిసైడ్ అయ్యింది. ఆ రెండు జిల్లాల్లో ఒక్క సీటు కూడా వైసీపీకి దక్కకూడదని పవన్ కళ్యాణ్ కృత నిశ్చయంతో ఉన్నారు. ఈ సమయంలోనే ముద్రగడ ద్వారా కాపు సామాజిక వర్గంలో చీలిక తేవాలని జగన్ భావించారు. ముద్రగడను వైసీపీలోకి రప్పించాలని భావించారు. అటు వైసిపి కీలక నేతలు చర్చలు జరపడంతో ముద్రగడ కుటుంబ సభ్యులతో కలిసి వైసీపీలో చేరడం ఖాయమని ప్రచారం సాగింది. దీనిపై అధికార ప్రకటనే తరువాయి అన్న రేంజ్ లో టాక్ నడిచింది. కానీ నెలల కొద్ది జాప్యం జరుగుతూ వస్తోంది. ఇంతవరకు ముద్రగడ అధికారిక ప్రకటన చేయలేదు.
ఇటువంటి సమయంలో జనసేన కీలక నేతలు ముద్రగడతో చర్చలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాజాగా జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ ముద్రగడతో సమావేశమయ్యారు. జనసేనలోకి రావాలని ఆహ్వానించారు. టిడిపి, జనసేన కూటమిలోకి రావడం ద్వారా మేలు జరుగుతుందని ముద్రగడకు సూచించారు. పవన్ రాసిన లేఖను జనసేన నేత ముద్రగడకు అందించారు. దీనిని ఆహ్వానించారు ముద్రగడ. అయితే కొన్ని అంశాలను లేవనెత్తినట్లు సమాచారం. ఈ అనూహ్య పరిణామాల నడుమ గురువారం టిడిపి నేత జ్యోతుల నెహ్రూ ముద్రగడను కలవనున్నట్లు తెలుస్తోంది. టిడిపి, జనసేన కూటమిలోకి ఆహ్వానించనున్నట్లు సమాచారం.
కాపు సామాజిక వర్గంలో చీలిక తేవడానికి జగన్ ప్రయత్నాలు ప్రారంభించారు. అందుకే దానికి చెక్ చెప్పాలని చంద్రబాబు, పవన్ భావిస్తున్నారు. ముద్రగడ లాంటి వ్యక్తులను కూటమిలోకి తెస్తే వార్ వన్ సైడ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. అందుకే రెండు పార్టీలు సమన్వయంతో వ్యవహరించి.. ముద్రగడను తమ వైపు తిప్పుకునేలా ప్లాన్ చేశారు. ముందుగా జనసేన నేతలు వెళ్ళగా.. ఈరోజు టిడిపి నేతలు ముద్రగడను కలవనున్నారు. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో.. టిడిపి, జనసేన కూటమి తప్పకుండా అధికారంలోకి వస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కూటమి వైపు వస్తే సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇస్తున్నారు.
అయితే అవసరం అనుకుంటే పవన్ నేరుగా ముద్రగడతో చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి రోజుల్లో నేరుగా ముద్రగడ నివాసానికి వెళ్లి పవన్ భేటీ అవుతారని సమాచారం. వైసిపి కంటే జనసేన సేఫ్ జోన్ అని ముద్రగడ పద్మనాభం అనుచరులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీలో చేరితే గతంలో జగన్ కు లబ్ధి చేకూర్చే విధంగా వ్యవహరించారన్న అనుమానాలకు బలం చేకూరినట్లు అవుతుంది. అటు వైసిపి గెలుపుపై కూడా అనుమానాలు ఉన్నాయి. ఇటువంటి తరుణంలో జనసేనలో చేరితే ఉత్తమమని.. ఒకవేళ వైసీపీలో చేరినా.. ఫలితాలు తారుమారైతే ముద్రగడ రాజకీయాల నుంచి శాశ్వతంగా దూరమయ్యే అవకాశం ఉంది. అందుకే ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ముద్రగడ భావిస్తున్నారు. పవన్ తో భేటీ తర్వాత ముద్రగడ రాజకీయంగా స్టెప్ వేసే అవకాశం ఉంది. ఈ మారిన తాజా పరిణామాలతో వైసిపి అలెర్ట్ అయ్యింది. ముద్రగడకు వైసిపి నేతలు టచ్ లోకి వెళ్లినట్లు సమాచారం. అయితే ముద్రగడ నాన్చుడు ధోరణి చూస్తుంటే.. ఏదైనా కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారా? అన్నది తెలియాల్సి ఉంది. సంక్రాంతి రోజుల్లో తన రాజకీయ భవిష్యత్తును వెల్లడించే అవకాశాలు ఉన్నాయి.