Pawan Kalyan: గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ నినాదాన్ని అందుకున్నారు. హిందూ ధర్మ పరిరక్షణకు బలమైన వ్యవస్థ అవసరం అని తన అభిప్రాయాన్ని చెబుతూ వచ్చారు. చెప్పడమే కాకుండా అందుకు నడుం బిగించారు కూడా. హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా ఆలయాల సందర్శన, పీఠాధిపతుల ఆహ్వానం మేరకు వెళ్లడం వంటివి చేస్తున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ పై హిందుత్వ ముద్ర పడింది. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణలోని కొండ గుట్టకు వెళ్లారు పవన్ కళ్యాణ్. అయితే అక్కడ హిందుత్వవాదం పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
* టీటీడీ నిధులతో అభివృద్ధి..
పవన్ కళ్యాణ్ దూకుడుగా ఉంటారు. తన నిర్ణయాలను గట్టిగానే చెబుతారు. గతంలో కొండగుట్ట నుంచి అన్ని రకాల కార్యక్రమాలను ప్రారంభించడం సెంటిమెంట్ గా పెట్టుకున్నారు. అయితే ఏపీలో అధికారంలోకి వస్తే కొండగుట్ట అభివృద్ధికి సహకారం అందిస్తామని చెప్పారు. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం నిధులను విడుదల చేయించారు. ఆ నిధులతో అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు పవన్ కళ్యాణ్. పనిలో పనిగా మొన్నటి పంచాయితీ ఎన్నికల్లో సర్పంచులు గా, వార్డు సభ్యులుగా గెలిచిన వారిని అభినందించారు. జనసేన అభ్యర్థులు పోటీ చేసిన స్థానాల్లో సగానికి పైగా గెలవడం గొప్ప ఆనందం ఇచ్చిందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జనసేన పార్టీ పెట్టేందుకు తనలో చైతన్యం నిలిపింది.. ధైర్యం ఇచ్చింది తెలంగాణ సమాజం అని చెప్పుకొచ్చారు. రజాకార్లకు వ్యతిరేకంగా తెలంగాణ బిడ్డలు చేసిన పోరాటం.. అమరవీరుల త్యాగాల నుంచి తాను రాజకీయ శక్తిని పొందాలని స్పష్టం చేశారు.
* హిందుత్వ ముద్ర పై స్పందన..
మరోవైపు తనపై హిందుత్వముద్ర పై పరోక్షంగా స్పందించారు పవన్. హిందూ వాదాన్ని బలపరచడం అంటే ముస్లింలకు వ్యతిరేకం కాదని.. క్రిస్టియన్లకు వ్యతిరేకం కాదని.. ఇతర మతాలకు వ్యతిరేకం కాదని తేల్చి చెప్పారు పవన్ కళ్యాణ్. అన్ని మతాల సారం ఒకటేనని.. అన్ని మతాలు గౌరవించబడాలని.. రక్షించబడాలి అనేది తన అభిమతంగా చెప్పుకొచ్చారు పవన్. అయితే ఇటీవల బీజేపీ లైన్లో పవన్ మాట్లాడుతున్నారు అంటూ కొన్ని రకాల కామెంట్స్ వినిపించాయి. దక్షిణ భారతదేశంలో పవన్ కళ్యాణ్ ద్వారా హిందుత్వ వాదాన్ని బిజెపి బలంగా తీసుకెళ్తుందన్న అనుమానాలు ఉన్నాయి. దీనిపైనే పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చినట్లు అయింది. పవన్ కళ్యాణ్ కొండగుట్ట ఆలయం సెంటిమెంట్ గా ఉండేది.