Sudheer Reddy Arrested: తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర పరిణామం జరిగింది. బిజెపి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యారు. హైదరాబాదులో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. డి అడిక్షన్ సెంటర్కు తరలించినట్లు తెలుస్తోంది. ఏపీ రాజకీయాల్లో ఈ వార్త సంచలనాంశంగా మారింది. హైదరాబాదులోని నార్సింగి వద్ద పోలీసులు డ్రగ్స్ పై తనిఖీలు చేశారు. ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డిని పోలీసులు పట్టుకున్నారు. వైద్య పరీక్షలు సుధీర్ రెడ్డి డ్రగ్స్ తీసుకున్నట్లు తేలడంతో అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం అక్కడి నుంచి డి అడిక్షన్ సెంటర్ కు తరలించారు. ఆయనతో పాటు మరో వ్యక్తి సైతం డ్రగ్స్ తీసుకొని పట్టుబడినట్లు తెలుస్తోంది.
* గతంలో కూడా ఆరోపణ..
వాస్తవానికి సుధీర్ రెడ్డి పై గతంలో కూడా ఇటువంటి ఆరోపణలు వచ్చాయి. డ్రగ్స్ తీసుకుని పోలీసులకు పట్టుబడినట్లు తెలుస్తోంది. అయితే అప్పట్లో ఎలాగోలా తప్పించుకున్న ఆయన ఇప్పుడు మాత్రం పట్టుబడ్డారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం డ్రగ్స్ కు వ్యతిరేకంగా ఏపీలో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. పోలీస్ శాఖ అయితే అభ్యుదయ యాత్ర పేరిట భారీ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఏపీలో డ్రగ్స్ లేకుండా చూస్తామని చెబుతోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే అధికార పార్టీ ఎమ్మెల్యే డ్రగ్స్ తీసుకుని పట్టుబట్టడం సంచలనంగా మారింది. ఈ విషయంలో కూటమి ప్రభుత్వం ఇరకాటంలో పడే అవకాశం కనిపిస్తోంది.
* మూడు పార్టీలు మారిన వైనం..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు ఆదినారాయణ రెడ్డి. ఆ పార్టీ తరఫున 2014లో పోటీ చేసి గెలిచారు. అలా గెలిచిన కొద్ది రోజులకే వైసీపీ నుంచి ఫిరాయించి తెలుగుదేశం పార్టీలో చేరారు. మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. 2019లో జమ్మలమడుగు నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అలా ఓడిపోయిన కొద్ది రోజులకి భారతీయ జనతా పార్టీలో చేరారు. 2024 లో బిజెపి తరఫున పోటీ చేసి గెలిచారు ఆదినారాయణ రెడ్డి. పొలిటికల్ గా చాలా యాక్టివ్ గా ఉంటారు. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని నిత్యం టార్గెట్ చేసుకుంటారు. అటువంటి ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి డ్రగ్స్ తీసుకొని పట్టు పడడం ప్రత్యర్థులకు రాజకీయ అస్త్రంగా మారే అవకాశం ఉంది. దీనిపై కూటమి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.