Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan: ఏపీ మాదిరిగా తెలంగాణలో.. పవన్ ఆలోచన అదే!

Pawan Kalyan: ఏపీ మాదిరిగా తెలంగాణలో.. పవన్ ఆలోచన అదే!

Pawan Kalyan: తెలంగాణ రాజకీయాల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల ప్రకంపనలు సృష్టించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు ఆయన తలపెట్టిన సభను కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంది. మరోవైపు కవితతో పాటు భారత రాష్ట్ర సమితి నేతలు సైతం టార్గెట్ చేసుకున్నారు. వారిలో ఒక రకమైన భయం కనిపించింది పవన్ కళ్యాణ్ ద్వారా. ఇప్పుడు అదే నిజం చేస్తున్నారు పవన్. తెలంగాణ రాజకీయాల వైపు తొంగి చూస్తున్నారు. అక్కడే ఉండి రాజకీయాలు చేయనున్నారు. హైదరాబాదులో పార్టీ తెలంగాణ కార్యాలయాన్ని అందుబాటులోకి తెస్తున్నారు. ఈరోజు హైదరాబాద్ ఐటీ కారిడార్ మణికొండలో నూతనంగా నిర్మించిన జనసేన తెలంగాణ రాష్ట్ర కేంద్ర కార్యాలయాన్ని పవన్ కళ్యాణ్ ప్రారంభించనున్నారు. ఇప్పటివరకు పొత్తు ద్వారా, సోషల్ మీడియా ద్వారా తెలంగాణలో ప్రాభవాన్ని చాటుకున్న జనసేన.. పార్టీ కార్యాలయాన్ని అందుబాటులోకి తేవడం ద్వారా తెలంగాణ గడ్డపై సరికొత్త రాజకీయ ప్రస్తానానికి.. అధికారికంగా శ్రీకారం చుట్టబోతుందన్నమాట.

* తెలంగాణ నేతల్లో ఆ భయం..
తెలంగాణ రాజకీయ పార్టీల నేతలకు పవన్ కళ్యాణ్ విషయంలో ఒక ఆందోళన ఉంది.. ఏపీలో సైతం పవన్ కళ్యాణ్ చాలా సుదీర్ఘంగా పోరాడి శత శాతం విజయం సాధించారు. ఇక్కడ కూడా అటువంటి ప్రణాళిక రూపొందిస్తే తమకు ఇబ్బందులు తప్పవు అని భయపడుతున్నారు. తెలంగాణ ఆవిర్భావ దినం నాడు హైదరాబాదులో ప్రెస్మీట్లో గట్టిగానే సంకేతాలు పంపారు పవన్. రాబోయే ఎన్నికల్లో జనసేన పూర్తిస్థాయిలో బరిలో దిగుతుందని.. ఇక్కడి క్యాడర్ క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేస్తామని అధికారికంగా ప్రకటించారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా.. ఇప్పుడు ఏకంగా పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా తెలంగాణ రాజకీయాల్లో సీరియస్ గా దృష్టి పెట్టబోతున్నట్లు స్పష్టమైన సంకేతాలు పంపగలిగారు.

* ప్రజల వైఖరిలో మార్పు..
గతం కంటే తెలంగాణ ప్రజల వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. గతంలో ప్రత్యేక రాష్ట సెంటిమెంట్ ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం ప్రజలు అభివృద్ధికి, సమకాలిన అంశాలకు ఎక్కువగా ప్రాధాన్యమిస్తున్నారు. పైగా తెలంగాణలో ప్రస్తుతం రాజకీయ శూన్యత ఉంది. దానిని భర్తీ చేయడమే అజెండాగా జనసేన పని చేయనుంది. భారత రాష్ట్ర సమితి వరుస అపజయాలతో ఇబ్బంది పడుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీ పట్ల కొన్ని వర్గాల్లో అసంతృప్తి ఉంది. బిజెపి బలం పుంజుకున్నప్పటికీ నాయకత్వం సమస్య వెంటాడుతోంది. ఇటువంటి తరుణంలో ఏపీ మాదిరిగా తెలంగాణలో సైతం జనసేన ప్రత్యేక ఓటు బ్యాంకు కొల్లగొట్టాలని చూస్తోంది. ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో సెటిలర్స్, ఉద్యోగులు ఉన్న ప్రాంతాల్లో జనసేన బలం పెంచుకోవాలని భావిస్తోంది. యువతతో పాటు విద్యార్థుల ఓట్లపై గురిపెడుతోంది.

* సమయం కేటాయింపు..
ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఉన్నారు. కీలక మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తున్నారు. అయితే హైదరాబాదులో నివాసం ఉన్న దృష్ట్యా అక్కడి నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. అందుకే వారంలో ఒకరోజు తెలంగాణ కార్యకలాపాలకు కేటాయించే అవకాశం ఉంది. వారాంతంలో షెడ్యూల్ తెలంగాణ కార్యాలయానికి కేటాయిస్తారని సమాచారం. రాబోయే రోజుల్లో తెలంగాణలో ఒక బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా జనసేన మారే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో..

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version