Pawan Kalyan: జనసేన అధినేత పవన్ పోటీపై సస్పెన్స్ వీడింది. ఆయన పోటీ చేయబోయే నియోజకవర్గంపై ఫుల్ క్లారిటీ వచ్చింది. ఇన్ని రోజులు పవన్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారో అంటూ ఎదురుచూసిన జనసైనికుల నిరీక్షణకు తెరపడింది. ఆయన పిఠాపురం నుంచి పోటీ చేయడం ఖాయమైంది. అయితే ఈ వార్త ఇంతకు ముందులా ప్రచారం మాత్రం కాదు.స్వయంగా పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని ప్రకటించారు. పిఠాపురం నుంచి పోటీ చేస్తానని తేల్చి చెప్పారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా తాను పోటీ చేయబోయే నియోజకవర్గంపై స్పష్టతనివ్వడమే కాకుండా ఎంపీగా పోటీ చేసే విషయాన్ని కూడా ప్రస్తావించారు.
గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గాజువాకతో పాటు భీమవరం అసెంబ్లీ స్థానానికి పోటీ చేశారు. రెండు చోట్ల ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో ఆ రెండింటిలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. వాటితో పాటు తిరుపతి, అనంతపురం ఇలా రకరకాల టాక్ నడిచింది. మరోవైపు ఎమ్మెల్యే తో పాటు కాకినాడ ఎంపీ సీటుకు సైతం పోటీ చేస్తారని ప్రచారం ఊపందుకుంది. కానీ ఆ అనుమానాలన్నింటినీ తెరదించుతూ పవన్ పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తానని ఫుల్ క్లారిటీ ఇచ్చారు. దీంతో జనసైనికులు ఊపిరి పీల్చుకున్నారు.
పవన్ పిఠాపురం నియోజకవర్గ ఎంపికపై బలమైన కారణం ఉంది. ఈ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం అధికం. దాదాపు 91 వేల మందికి పైగా కాపు ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. వైసీపీ అభ్యర్థి పెండెం దొరబాబు గెలుపొందారు. టిడిపి అభ్యర్థి వర్మ రెండో స్థానంలో నిలిచారు. జనసేన అభ్యర్థి మూడో స్థానానికి పరిమితమయ్యారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉన్న దృష్ట్యా ఇక్కడ గెలుపు ఏకపక్షమే. అందుకే పవన్ ఈ నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇక్కడ వైసిపి అభ్యర్థిగా వంగా గీతను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.
పిఠాపురం నియోజకవర్గం విషయంలో ముందుగానే పవన్ సంకేతాలు పంపారు. వారాహి విజయ యాత్రను ఇక్కడి నుంచే ప్రారంభించారు. పవన్ కోసం ప్రత్యేకంగా హెలిపాడ్ ఏర్పాటు చేయడం కూడా ఒక సంకేతంగా నిలిచింది. మరోవైపు పొత్తులో భాగంగా కాకినాడ ఎంపీ స్థానాన్ని జనసేన తీసుకుంది. అదే పార్లమెంట్ స్థానం పరిధిలో ఉన్న పిఠాపురం నుంచి పవన్ పోటీ చేస్తే ఏకపక్ష విజయం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికైతే పవన్ పోటీ చేయబోయే నియోజకవర్గంపై ఫుల్ క్లారిటీ వచ్చింది. త్వరలో అక్కడ పవన్ కార్యకలాపాలను ప్రారంభించనున్నారు. దీంతో పిఠాపురం జనసేన వర్గాల్లో జోష్ నెలకొంది.మరోవైపు ఎంపీగా తనకు పోటీ చేసే ఉద్దేశం లేదని పవన్ తేల్చి చెప్పారు. తద్వారా గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి చెక్ చెప్పారు.