Pawan Kalyan: ఇద్దరు జనసేన ఎమ్మెల్యేలపై పవన్ ఆగ్రహం గా ఉన్నారా? వారి చర్యలపై ఫిర్యాదులు వచ్చాయా? పారిశ్రామికవేత్తల నుంచి వారు డబ్బులు డిమాండ్ చేస్తున్నారా? అందుకే వారికి పవన్ హెచ్చరించారా? పనితీరు మార్చుకోవాలని సూచించారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. ఈ ఎన్నికల్లో జనసేన 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి సంపూర్ణ విజయం సాధించింది. ఉత్తరాంధ్ర నుంచి ఆరు సీట్లలో గెలుపొందింది. ప్రధానంగా విశాఖ జిల్లా నుంచి నలుగురు పోటీ చేసి గెలిచారు. అనకాపల్లి నుంచి కొణతాల రామకృష్ణ, ఎలమంచిలి నుంచి సుందరపు విజయ్ కుమార్,పెందుర్తి నుంచి పంచకర్ల రమేష్ బాబు,విశాఖ ఉత్తరం నుంచి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గెలిచారు. ఇందులో సుందరపు విజయ్ కుమార్ జనసేన ఆవిర్భావం నుంచి పనిచేస్తున్నారు.మిగతా ముగ్గురు మాత్రం ఎన్నికల ముందు చేరారు. అయితే ఈ నలుగురిలో ఓ ఇద్దరిపై తాజాగా ఆరోపణలు వచ్చాయి. తమ నియోజకవర్గ పరిధిలోని పారిశ్రామికవేత్తల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నారన్నది ప్రధాన ఆరోపణ. అయితే ఈ నలుగురిలో ఆ ఇద్దరు ఎవరనేది తెలియాల్సి ఉంది. అయితే పరిశ్రమలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలు అనకాపల్లి,పెందుర్తి, ఎలమంచిలి ఉన్నాయి. అయితే ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరు అన్నది మాత్రం తెలియడం లేదు. పొలిటికల్ వర్గాల్లో మాత్రం దీనిపై క్లారిటీ ఉంది.
* సీఎం రమేష్ ఫిర్యాదుతో
ప్రస్తుతం అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడిగా సీఎం రమేష్ ఉన్నారు.బిజెపి నుంచి గెలుపొందారు. పారిశ్రామికవేత్త కూడా. పారిశ్రామిక వర్గాలకు మంచి సంబంధాలు ఉన్నాయి ఆయనకు.అనకాపల్లి నుంచి గెలిచిన ఆయన తన పార్లమెంట్ స్థానం పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాల్లో తరచూ పర్యటిస్తున్నారు.ఈ క్రమంలోనే కొందరు పరిశ్రమల యజమానులు సీఎం రమేష్ కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.ఓ ఇద్దరు జనసేన ఎమ్మెల్యేలు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపణ రావడంతో.. సీఎం రమేష్ పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. పవన్ దీనిపై సీరియస్ గా దృష్టి పెట్టినట్లు సమాచారం. సంబంధిత ఎమ్మెల్యేలకు చివరి హెచ్చరిక అన్నట్టు సంకేతాలు పంపించినట్లు తెలుస్తోంది.
* ఆది నుంచి అదే ధోరణి
పవన్ కళ్యాణ్ ఆది నుంచి అవినీతి విషయంలో చాలా కఠినంగా ఉన్నారు. పార్టీ ఎమ్మెల్యేలకు సైతం కీలక సూచనలు ఇచ్చారు. ప్రజలు ఎంతో నమ్మకంతో మనకు అవకాశం ఇచ్చారని.. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా చూసుకోవాలని హెచ్చరించారు. తాను తప్పు చేసిన కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం లోనే స్పష్టం చేశారు. పార్టీ ఎమ్మెల్యేలతో సైతం సమావేశాలు ఏర్పాటు చేసి.. ఈ విషయంలో స్పష్టమైన సూచనలు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఓ ఇద్దరూ ఎమ్మెల్యేల వ్యవహార శైలి పై మాత్రం ఆగ్రహంగా ఉన్నారు. ఆధారాలతో సహా తేలడం వల్లేపవన్ ఈ విషయంలో సీరియస్ అయినట్లు సమాచారం. అయితే సీఎం రమేష్ ఫిర్యాదు తోనే జనసేన ఎమ్మెల్యే పై పవన్ ఆగ్రహం వ్యక్తం చేయడం విశేషం.