Nara Lokesh: ఇటీవల తెలుగుదేశం, బిజెపి మధ్య స్నేహబంధం మరింత చిగురిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు మోడీ నాయకత్వాన్ని హైలైట్ చేస్తున్నారు. మోడీ ఒక వ్యూహం, ఒక విజన్,ఒక పద్ధతి ప్రకారం ముందుకెళ్లే నేతగా అభివర్ణించారు చంద్రబాబు.మోదీ నాయకత్వం ఈ దేశానికి అవసరమనినొక్కి చెబుతున్నారు చంద్రబాబు.దేశంలో సుస్థిరత కొనసాగాలంటే మోడీ నాయకత్వం మరింత బలపడాలని ఆకాంక్షించారు. మొన్న హర్యానాలో కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చంద్రబాబు హాజరయ్యారు. అటు తరువాత అక్కడే జరిగిన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో సైతం పాల్గొన్నారు. ప్రధాని నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో టిడిపి భాగస్వామ్యం అవుతుందని స్పష్టం చేశారు. తమ సహకారం నిరంతరం కొనసాగుతుందని కూడా తేల్చి చెప్పారు. అయితే గత ఐదేళ్లుగా జరిగిన పరిణామాలు టిడిపికి బిజెపి స్నేహాన్ని దూరం చేశాయి.దానిని మరింత దగ్గర చేసుకోవాలన్న ప్రయత్నమే చంద్రబాబు నుంచి కనిపిస్తోంది. అదే సమయంలో ఏపీ విషయంలో.. బిజెపి నుంచి సరైన సహకారం తీసుకోవడం లక్ష్యంగా కనిపిస్తోంది. ఇందులో పరస్పర రాజకీయ ప్రయోజనాలు సైతం స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోసారి జాతీయస్థాయిలో బిజెపి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో టిడిపి కూటమి ప్రభుత్వం ఏర్పాటు లక్ష్యంగా..కేంద్ర పెద్దలతో చంద్రబాబు ఒక ఒప్పందం కుదుర్చుకున్నట్లు స్పష్టమైంది. గత కొద్ది రోజులుగా చంద్రబాబు ప్రకటనలు చూస్తే ఇది అర్థమవుతుంది.
* అమిత్ షాతో లోకేష్ భేటీ
తాజాగా మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో పర్యటించారు. కేంద్ర మంత్రి అమిత్ షాను కలిశారు. దాదాపు గంట సేపు పాటు ఏపీ రాజకీయాలపై చర్చలు జరిపారు.అయితే ఈ సందర్భంగా లోకేష్ ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర మంత్రి అమిత్ షా తో జరిపిన చర్చలు విజయవంతం అయ్యాయని.. ఏపీ సమగ్రాభివృద్ధికి అమిత్ షా సహకరిస్తామని చెప్పారని.. అందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే అమిత్ షా తో లోకేష్ సమావేశం అయ్యింది ఆదివారం పూట. ఆరోజు అధికారిక కార్యక్రమాల్లో అమిత్ షా పాల్గొనరు. అంటే లోకేష్ తో సమావేశం పూర్తిగా రాజకీయపరమైనదని తెలిసిపోతోంది.
* పరస్పర ప్రయోజనాలు
కేంద్రంలో బిజెపి పరిస్థితి గతం మాదిరిగా కాదు. కాంగ్రెస్ పార్టీతో పాటు ఇండియా కూటమి అక్కడ పుంజుకుంటోంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉండే జగన్ దగ్గరయ్యేలా కనిపిస్తున్నారు. దీంతో అటు జాతీయస్థాయిలో బిజెపికి, రాష్ట్రస్థాయిలో టిడిపికి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. అందుకే ఏపీలో జగన్ ను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర సహకారం కోరుతోంది తెలుగుదేశం పార్టీ. కేంద్ర పెద్దలు సైతం టిడిపికి అన్ని విధాలా భరోసా ఇస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో మోదీ నాయకత్వం ఈ దేశానికి అవసరం అని చంద్రబాబు ప్రచారం మొదలుపెట్టారు. తాజాగా నారా లోకేష్ సమావేశం వెనుక పొలిటికల్ అజెండా ఉందని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఇండియా కూటమి వైపు జగన్ అడుగులు వేస్తున్న దృష్ట్యా.. బిజెపి నుంచి ఇప్పుడు టిడిపికి సంపూర్ణ సహకారం ప్రారంభమైంది. అది జగన్ కు ఎంతవరకు ఇబ్బందులు తెచ్చి పెడుతుందో చూడాలి.