Pawan Kalyan: ఏపీలో పొత్తుల వ్యవహారం కొలిక్కి తేవడంలో పవన్ సక్సెస్ అయ్యారు. టిడిపిని బిజెపితో కలవడం వెనుక పవన్ కృషి ఉంది. ఇదే విషయాన్ని ఆయన చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. బిజెపి అగ్రనేతల వద్ద తనకు పరపతి ఉందని కూడా తేల్చి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు అదే కేంద్ర పెద్దలు పవన్ కు ఒక కీలక సూచన చేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేతో పాటు ఎంపీగా పోటీ చేయాలని అగ్రనేత అమిత్ షా సూచించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇది వ్యూహాత్మకంగా ప్రచారం చేస్తున్నారా? నిజంగానా? అన్నది తెలియాల్సి ఉంది.
పొత్తులో భాగంగా జనసేనకు 24 అసెంబ్లీ స్థానాలతో పాటు మూడు పార్లమెంట్ స్థానాలు కేటాయించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కానీ బిజెపి కూటమిలోకి ఎంట్రీ తో సీన్ మారింది. ఒక పార్లమెంట్ స్థానాన్ని త్యాగం చేయాల్సి వచ్చింది. బిజెపి రాక మునుపు.. అనకాపల్లి స్థానం నుంచి నాగబాబు, కాకినాడ నుంచి సానా సతీష్, మచిలీపట్నం నుంచి వల్లభనేని బాలశౌరి జనసేన తరఫున పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు కొత్తగా పవన్ కాకినాడ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. చంద్రబాబుతో పాటు పవన్ ఢిల్లీ వెళ్లి వెళ్లిన తరువాత.. బిజెపితో పొత్తు కుదిరిన తర్వాత ఈ తరహా ప్రచారం జరగడం విశేషం.
అయితే ఈ ప్రచారంతో కూటమికి నష్టం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎంపీగా పవన్ పోటీ చేయడం ద్వారా కేంద్ర క్యాబినెట్ లోకి వెళ్లడం సులువైన అంశం. కానీ పవన్ రాష్ట్ర రాజకీయాలను విడిచిపెట్టి కేంద్రంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తారని తెలిస్తే.. కాపు సామాజిక వర్గం తో పాటు పవన్ అభిమానులు భిన్నంగా స్పందించడం ఖాయం. అదే జరిగితే ఓట్ల బదలాయింపు, కూటమి సమన్వయం విషయంలో రకరకాల అనుమానాలు తలెత్తే అవకాశం ఉంది. అటు వైసీపీ సైతం విషప్రచారానికి దిగుతోంది. ఎమ్మెల్యేగా పవన్ గెలిచే ఛాన్స్ లేకపోవడం వల్లే ఎంపీగా పోటీ చేస్తున్నారని ప్రచారం చేస్తోంది. వైసీపీ సోషల్ మీడియా విభాగం దీనిపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టింది.
ఇప్పటికే పొత్తులో భాగంగా తక్కువ సీట్లు లభించాయని జనసైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 175 నియోజకవర్గాలకు గాను 24 సీట్లు కేటాయించడాన్ని సహించలేకపోతున్నారు. మూడు పార్లమెంట్ స్థానాలకు గాను.. బిజెపి కోసం ఒక్క స్థానాన్ని విడిచి పెట్టడాన్ని కూడా తప్పుపడుతున్నారు.ఆ విషయంలో టిడిపి ఎందుకు త్యాగం చేయలేదని ప్రశ్నిస్తున్నారు.ఇచ్చిందే తక్కువ స్థానాలు అయితే.. జనసేనలో టిడిపి నేతలు చేరి టిక్కెట్లు దక్కించుకోవడాన్ని కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. సరిగ్గా ఇటువంటి సమయములోనే పవన్ ఎంపీగా పోటీ చేసి కేంద్ర రాజకీయాల్లోకి ప్రవేశిస్తారని సంకేతాలు అందుతున్నాయి. అటువంటప్పుడు టిడిపిని గెలిపించి చంద్రబాబును సీఎం చేసేందుకు తాము కృషి చేయాలా అన్న ప్రశ్న జనసైనికులతో పాటు కాపు సామాజిక వర్గం నుంచి వినిపిస్తోంది. దీనిపైనే వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేస్తోంది. అయితే దీనిని గుర్తించి పవన్ నష్ట నివారణ చర్యలు చేపడుతారో ? లేదో? అన్నది చూడాలి.