Pawan Kalyan: భారతీయ జనతా పార్టీ( Bhartiya Janata Party) తదుపరి టార్గెట్ తమిళనాడు. ఈ ఏడాది తమిళనాడు తో పాటు పశ్చిమ బెంగాల్ కు ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు చోట్ల అధికారంలోకి రావాలని గట్టి ప్రయత్నాల్లో ఉంది భారతీయ జనతా పార్టీ. ఈ రెండు చోట్ల మిత్రుల సాయంతో సైతం చొచ్చుకెల్లాలని ప్రయత్నిస్తోంది. ప్రధానంగా తమిళనాడులో హిందుత్వవాదంతో ముందుకు వెళ్తోంది. దశాబ్దాలుగా ద్రవిడ సంస్కృతిని గట్టిగానే ఎదుర్కొనే ప్రయత్నం చేస్తోంది. ఇంకోవైపు కలిసి వచ్చే పార్టీలను కలుపు కెళ్లే ప్రయత్నం చేస్తోంది. పొత్తులు పెట్టుకోవాలని భావిస్తోంది. కానీ బిజెపితో కలిసేందుకు రాజకీయ పార్టీలు ఆలోచన చేస్తున్నాయి. ఎందుకంటే తమిళనాడులో ద్రవిడ సిద్ధాంతాలు బలంగా ఉంటాయి అక్కడి ప్రజల్లో. బిజెపితో కలిస్తే అక్కడి ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారో అన్న ఆ పార్టీల్లో ఉంటుంది. అందుకే బిజెపి హిందుత్వవాదంతో కనీసం ప్రతిపక్ష హోదా దక్కించుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది.
* విజయ్ విముఖత..
తమిళనాడులో సినీ నటుడు విజయ్( cine actor Vijay) పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే విజయ్ బిజెపితో చేతులు కలుపుతారని అంతా భావించారు. ఎన్డీఏ లోకి వస్తారని ఆశించారు. కానీ ఆయన నుంచి సానుకూలత రాకపోవడంతో బీజేపీ పునరాలోచనలో పడింది. అక్కడ ద్రవిడ సిద్ధాంతానికి వ్యతిరేకంగా సనాతన ధర్మాన్ని తెరపైకి తెచ్చింది. హిందుత్వవాదంతో మరో అయోధ్య అన్నట్టు ప్రచారంలోకి తెచ్చింది. అయితే ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది తెలియడం లేదు. మరోవైపు దేశవ్యాప్తంగా బిజెపి హవా నడుస్తుందని ఇండియా టుడే సి ఓటర్ సర్వే తేల్చింది. తమిళనాడు విషయానికి వచ్చేసరికి మాత్రం డిఎంకె నేతృత్వంలో కూటమి అధికారంలోకి వస్తుందని తేల్చేసింది. కేంద్ర నిఘా వర్గాలు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్లు సమాచారం.
* ఆ 20 నియోజకవర్గాలపై ఫోకస్..
తమిళనాడులో ఎలాగైనా ప్రతిపక్ష పాత్ర పోషించాలన్నది బిజెపి ఆలోచన. ఓట్లతో పాటు సీట్లు కూడా పెంచుకోవాలని చూస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఇటువంటి తరుణంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక ఆశా కిరణంగా బిజెపికి కనిపిస్తున్నారు. తమిళనాడులో ఆధ్యాత్మికత ఎక్కువ కానీ.. ద్రవిడ సిద్ధాంతం ముందు తల వంచక తప్పడం లేదు. అయితే వేరే మతాలు దేవుడు పేరిట రాజకీయాలు చేస్తున్న విషయాన్ని అక్కడ హిందువులు గుర్తిస్తున్నారు. అయితే వారిని కదిలించగల బలమైన శక్తిగా పవన్ ఉన్నారన్నది బిజెపి భావన. పైగా తమిళనాడులో తెలుగు ప్రభావిత నియోజకవర్గాలు 20 వరకు ఉన్నాయి. అటువంటి చోట పవన్ కళ్యాణ్ తో ప్రచారం చేయిస్తే వర్క్ అవుట్ అవుతుందని బిజెపి పెద్దల ఆలోచనగా తెలుస్తోంది. అందుకే మొన్న పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకంగా ఢిల్లీ పిలిచి అమిత్ షా కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. తమిళనాడు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ చరిష్మను వాడుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.