Jagan: ఇంటా గెలిచి రచ్చ గెలవాలి అంటారు. అలా చేయకపోతే బయట వారు కూడా గుర్తించలేరు. సొంత ఇంటిని చక్కదిద్దుకోలేని వాడు సమాజాన్ని ఏం చేస్తాడులే అని భావిస్తుంటారు. ఈ విషయంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి( Y S Jagan Mohan Reddy) ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన కుటుంబ సభ్యుల నుంచి సానుకూలత పొందలేకపోతున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఆయన ఓటమికి అదే ప్రధాన కారణం. ఆయన కు వ్యతిరేకంగా సోదరి షర్మిల నిలవగా.. ఆమెకు అండగా తల్లి విజయమ్మ ఉన్నారు. కడప పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన షర్మిలను గెలిపించాలని కోరిన విజయమ్మ.. కుమారుడు జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఆశీర్వదించలేదు. ఆయన గురించి ప్రస్తావించలేదు. అయితే కోపతాపాలు కొద్దిరోజుల వరకు ఉంటాయని అంతా భావించారు. కానీ ఇప్పటికీ అదే ధోరణితో ఉన్నట్టు ఉంది పరిస్థితి. ఇటీవల మీడియా ముందుకు వచ్చిన జగన్ పాదయాత్ర చేయడం వేస్ట్.. ఆయనకు అధికారం రాదంటూ చాలా తేలిగ్గా మాటలు ఆడేశారు. తద్వారా వారి మధ్య విభేదాలు సమసి పోలేదని స్పష్టమవుతోంది. అయితే కుటుంబ సభ్యులతో ఉన్న విభేదాలు తొలగించుకోకపోతే జగన్మోహన్ రెడ్డికి మాత్రం చాలా కష్టం. ఇది ఎవరిని అడిగినా ఇట్టే చెప్పేస్తారు. ఎందుకంటే ముందుగా కుటుంబ ఐక్యతను చూస్తారు. దానిని ఎక్కువ మంది తప్పు పడతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయంలో జరుగుతోంది అదే.
* దగ్గర చేసుకోకపోతే కష్టం..
అసలు జగన్మోహన్ రెడ్డి ఏ ఆలోచనతో ఉన్నారో తెలియడం లేదు. దూరమైన వర్గాలను దగ్గర చేసుకోవాలన్న ఆలోచన చేయడం లేదు. అదే ఆలోచన చేస్తే కుటుంబంలో వచ్చిన అడ్డుగోడలను ముందుగా తొలగించుకుంటారు. కానీ ఎందుకో ఆయన ఆ పని చేయడం లేదు. కుటుంబ శ్రేయోభిలాషులు చాలామంది సలహాలు ఇస్తుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి వాటిని పరిగణలోకి తీసుకునే అవకాశం కనిపించడం లేదు. ఇలానే ముందుకు సాగితే ఆయనకు ఇబ్బందికరమే. ఎందుకంటే మొన్న కడప జిల్లాలో మోగిన డేంజర్ బెల్స్ ఆయన గ్రహించుకోవాల్సిన అవసరం ఉంది. చివరకు పులివెందుల వరకు కూటమి టచ్ చేసిందంటే దాని వెనుక కుటుంబ చీలిక ఉంది. దానిని సరి చేసుకోకపోతే మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందికరమే.
* ఆ ఇమేజ్ కు డ్యామేజ్..
ప్రజలు ప్రతి మాటను ఆలోచిస్తారు. ప్రతి మాటను పరిగణలోకి తీసుకుంటారు. రాజశేఖర్ రెడ్డి ( Y S Rajasekhara Reddy ) కుటుంబం అంటే తెలుగు రాజకీయాల్లో ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ ఇమేజ్ను కాపాడుకోలేకపోయారు జగన్మోహన్ రెడ్డి. ముఖ్యంగా కుటుంబంలో వచ్చిన అగాధాలను, విభేదాలను పరిష్కరించుకోవడంలో ఆయన సాహసించలేకపోయారు. చాలా తేలిగ్గా తీసుకున్నారు. దీంతో మూల్యం చెల్లించుకున్నారు. అయితే ఆ పరిస్థితి నుంచి అధిగమించే ప్రయత్నం ఇప్పటికీ చేయడం లేదు. రోజురోజుకు వారి మధ్య గ్యాప్ పెరుగుతోంది. దీనిని సరి చేసుకోకపోతే మాత్రం జగన్మోహన్ రెడ్డికి ముందుగా ఇబ్బందులు వస్తాయి. తన తండ్రి పేరిట పెట్టుకున్న పార్టీకి ఇబ్బందులు తప్పవు. అందుకే కుటుంబంలో ముందు విభేదాలు సరిచేసుకుని.. ప్రజాక్షేత్రంలోకి వస్తేనే కాస్త మంచి ఫలితాలు వస్తాయి. ఇక ఆలోచించుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి మాత్రమే.