Pawan Kalyan High Court: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై( Pawan Kalyan) పెట్టిన కేసు విచారణ రేపు హైకోర్టులో రానున్నట్లు ప్రచారం నడుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్ల గురించి పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. జగన్ తీసుకొచ్చిన వలంటీర్ వ్యవస్థ కారణంగా వ్యక్తిగత గోప్యత లేకుండా పోయిందని.. ముఖ్యంగా మహిళల వ్యక్తిగత విషయాలు బయటకు వచ్చాయని.. ఈ కారణంగానే రాష్ట్ర వ్యాప్తంగా 30 వేల మంది మహిళలు అదృశ్యం అయ్యారని అప్పట్లో కామెంట్స్ చేశారు పవన్ కళ్యాణ్. అప్పట్లో వాలంటీర్ల ఫిర్యాదు మేరకు పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు అయింది. అప్పటి వైసిపి ప్రభుత్వం కూడా చర్యలకు ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ పై ఆ కేసులను ఎత్తివేసింది. ఈ నేపథ్యంలో ప్రముఖ న్యాయవాది, జై భీమ్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రేపు అది విచారణకు వచ్చే అవకాశం ఉంది.
Also Read: బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక.. అసమ్మతి రాజేసిన రాజాసింగ్
* ఎన్నికలకు ముందు ఆరోపణలు..
2024 ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ విధానాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అందులో భాగంగా వాలంటీర్ వ్యవస్థ పై చాలా రకాలుగా వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా లాభం కంటే నష్టం అధికం అని అప్పట్లో ఆరోపించారు. కేవలం 5000 రూపాయల జీతం ఇచ్చి.. వారితో అన్ని పనులు చేయించుకుంటున్నారని ఆరోపించారు. ప్రతి 50 కుటుంబాల సమాచారం వాలంటీర్ల వద్ద ఉంటుందని.. వారి వద్ద నుంచి సంఘ విద్రోహశక్తుల చేతుల్లోకి వెళుతోందని.. దీంతో మహిళల అదృశ్యం పెరిగిందని.. దేశంలోనే ఏపీలో అధికంగా మహిళలు కనిపించకుండా పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అప్పట్లో పవన్ కామెంట్స్ పై వాలంటీర్లు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీసులకు ఫిర్యాదులు చేశారు. పవన్ పై చర్యలకు ఉపక్రమించాలని వైసిపి ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు కూడా జారీచేసింది.
* రేపు విచారణ?
మరోవైపు టిడిపి కూటమి( TDP Alliance ) అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది. తాము వస్తే వాలంటీర్లను కొనసాగించడమే కాకుండా పదివేల రూపాయల గౌరవ వేతనం అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే నెలలు గడుస్తున్నా వాలంటీర్లను విధుల్లోకి తీసుకోలేదు. మరోవైపు వాలంటీర్ల వ్యవస్థ పై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు సంబంధించిన కేసును రద్దు చేసింది కూటమి ప్రభుత్వం. దీనిపై సవాల్ చేస్తూ ఇద్దరు మాజీ మహిళా వాలంటీర్లతో కేసు పెట్టారు ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్. ఆ కేసును ఎలా రద్దు చేస్తారంటూ సవాల్ చేశారు. రేపు ఈ కేసు హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఇది షాకింగ్ పరిణామమే.