Quantum Valley In AP : టెక్నాలజీని( Technology) అందిపుచ్చుకోవడంలో ఏపీ సీఎం చంద్రబాబు ఎప్పుడూ ముందుంటారు. ఈ విషయంలో ఆయన శత్రువులు సైతం దానిని ఒప్పుకుంటారు. 1999లో రెండోసారి సీఎం అయ్యారు చంద్రబాబు. ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. దానికి తగ్గట్టు అడుగులు వేశారు. దాని ఫలాలు, ఫలితాలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అనుభవిస్తుంది. చంద్రబాబుతో రాజకీయంగా విభేదించిన వారు సైతం దీనిని ఒప్పుకున్నారు. అయితే ఇప్పుడు నవ్యాంధ్రప్రదేశ్ ను సైతం అదే మాదిరిగా అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు చంద్రబాబు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్స్ ఇలా కొత్త కొత్తగా ఆలోచనలు చేస్తున్నారు. అందులో భాగంగా తాజాగా విజయవాడలో అమరావతి క్వాంటం వ్యాలీ నేషనల్ వర్క్ షాప్ నిర్వహించారు. సీఎం చంద్రబాబు తో పాటు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్రాన్ని క్వాంటం టెక్నాలజీలో ఎలా అగ్రగామిగా నిలుపుతామో తమ ప్రణాళికను వెల్లడించారు. భవిష్యత్తులో దేశంలో ఏపీ అగ్రగామిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
* తరలివచ్చిన టెక్ దిగ్గజ సంస్థలు..
అయితే ఈ వర్క్ షాప్ నకు ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థలు వచ్చాయి. ఐబీఎం( IBM),టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ( టిసిఎస్ ), లార్సన్ అండ్ టౌబ్రో ( ఎల్ అండ్ టి) వంటి అంతర్జాతీయ టెక్ దిగ్గజాలు, మరోవైపు ఐఐటి మద్రాస్ వంటి ప్రముఖ విద్యాసంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. త్వరలో అమరావతిలో మొదటి క్వాంటం వ్యాలీని ప్రారంభించనున్నారు. 2026 లోనే ఆవిష్కరించేందుకు సిద్ధపడుతున్నారు. ఈ క్రమంలో ఈ వర్క్ షాప్ నిర్వహించడం ఆకట్టుకుంది. సీఎం చంద్రబాబు సైతం క్వాంటం టెక్నాలజీ విషయంలో తమ ప్రభుత్వ ఆలోచనలు, ప్రణాళికలను వివరించే ప్రయత్నం చేశారు. ఏపీ భవిష్యత్తుకు క్వాంటం టెక్నాలజీ అండగా నిలుస్తుందని కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు.
* చంద్రబాబు దిశ నిర్దేశం..
ఈ వర్క్ షాప్ లో సీఎం చంద్రబాబు( CM Chandrababu) కీలక ప్రసంగం చేశారు. 90వ దశకంలో ఐటీ విప్లవంలో ఉమ్మడి ఏపీ నాయకత్వం వహించినట్టే.. క్వాంటం టెక్నాలజీలో నవ్యాంధ్రప్రదేశ్ అదే స్థానాన్ని నిలబెట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తన ప్రసంగంలో టెక్ దిగ్గజా సంస్థలకు నమ్మకం కలిగించేలా కీలక వ్యాఖ్యానాలు చేశారు.’ క్వాంటం టెక్నాలజీ వివిధ రంగాలలో విప్లవాత్మక మార్పులను తీసుకొస్తుంది. అమరావతిలో క్వాంటం వ్యాలీ ద్వారా ఆంధ్రప్రదేశ్ ఈ రంగంలో ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందాలి ‘ అని ఆశాభావం వ్యక్తం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. అమరావతిలో ఏర్పాటు చేయబోయే క్వాంటం వ్యాలీ టెక్ పార్కులో ఐబీఎం తయారు చేసే క్వాంటం సిస్టం.. దేశంలోనే గొప్ప ఆవిష్కరణ అవుతుందని కూడా చెప్పారు. ఈ ప్రాజెక్టు నాలుగు వేల కోట్ల రూపాయలతో రెండు దశల్లో అమలు కానుందని వివరించారు.
* నారా లోకేష్ కీలక ప్రసంగం..
ఇదే వర్క్ షాప్ లో ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్( Nara Lokesh) కీలక ప్రసంగం చేశారు. క్వాంటం వ్యాలీ ద్వారా రాష్ట్రంలో నైపుణ్య శిక్షణ పెంపొందుతుందని.. వేలాదిమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని చెప్పుకొచ్చారు. ఈ వర్క్ షాప్ ద్వారా అంతర్జాతీయ సంస్థల సహకారం అందుతుందని.. క్వాంటం టెక్నాలజీ రంగంలో ఆంధ్రప్రదేశ్ నాయకత్వాన్ని సాధిస్తుందని కూడా ధీమా వ్యక్తం చేశారు నారా లోకేష్. ఈ సందర్భంగా స్టార్టప్ లు, విద్యా సంస్థలు, పారిశ్రామిక ప్రతినిధులు సీఎం చంద్రబాబు తో పాటు మంత్రి నారా లోకేష్ తో సమావేశం అయ్యారు. కీలక చర్చలు జరిపారు.
* మూడు ప్రధాన లక్ష్యాలు
అమరావతిలో ఏర్పాటు కాబోయే క్వాంటం వ్యాలీ( Quantum Valley) ప్రాజెక్టుతో మూడు ప్రధాన లక్ష్యాలను సాధించాలని కూటమి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ముఖ్యంగా ప్రతిభను ఆకర్షించడం ప్రధాన ధ్యేయం. క్వాంటం కంప్యూటింగ్ రంగంలో పరిశోధకులు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలను ఆకర్షించేందుకు అనువైన వాతావరణాన్ని సృష్టించడం ప్రధాన లక్ష్యం. దేశీయ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా క్వాంటం పరిశోధన, అభివృద్ధిని వేగవంతం చేయడం రెండో లక్ష్యంగా పేర్కొన్నారు. మరోవైపు ఐబిఎం, టిసిఎస్, ఎల్ అండ్ టి వంటి సంస్థల సహకారంతో క్వాంటం ఆల్కరిధం, సంబంధిత టెక్నాలజీని అభివృద్ధి చేయడం మూడో లక్ష్యంగా పేర్కొన్నారు. ఈ వర్క్ షాప్ ద్వారా క్వాంటం హార్డ్వేర్, సెన్సింగ్, ఆవిష్కరణలపై నిపుణుల రౌండ్ టేబుల్ చర్చలు సాగాయి. స్టార్టప్ ఎగ్జిబిషన్లు, అమరావతి డిక్లరేషన్ విడుదల వంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మొత్తానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ వర్క్ షాప్ సక్సెస్ అయ్యింది. క్వాంటం వ్యాలీ ఏర్పాటులో కీలక అడుగులు పడినట్లు అయింది.