Janasena Pawan Kalyan: ఏపీలో( Andhra Pradesh) కూటమి అధికారంలోకి వచ్చి 16 నెలలు దాటుతోంది. మరో 15 సంవత్సరాలు పాటు కూటమి నిర్విరామంగా కొనసాగుతుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తాజాగా ప్రధాని నెల్లూరు పర్యటనలో సైతం ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం కొన్ని రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయినా సరే వాటన్నింటినీ అధిగమించి కూటమి కొనసాగుతుందని తేల్చి చెప్పారు పవన్ కళ్యాణ్. అయితే ఎన్ని రకాల అడ్డంకులు వస్తాయో పవన్ కళ్యాణ్ కు తెలుసు. తాజాగా రాష్ట్రంలో ఒక స్లోగన్ ప్రారంభం అయింది. కూటమి ప్రభుత్వంలో కాపులు అణచివేతకు గురవుతున్నారని ఆ సామాజిక వర్గానికి చెందిన కుల సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గంపై అనుమానాలు వ్యక్తం అయ్యేలా ప్రకటనలు చేస్తున్నారు. తద్వారా పవన్ కళ్యాణ్ స్పందిస్తారని ఆశిస్తున్నారు. కానీ అటువంటి వాటికి దూరం అని పవన్ వ్యవహరిస్తున్నారు.
కులం కుంపట్లు..
ఏపీ అంటేనే కుల రాజకీయాలు అధికం. ఫలానా కులం.. ఫలానా పార్టీ అనేలా ఇక్కడ రాజకీయాలు ఉంటాయి. కమ్మ సామాజిక వర్గం అయితే తెలుగుదేశం… కాపు సామాజిక వర్గం అయితే జనసేన.. వైయస్సార్ కాంగ్రెస్ అంటే రెడ్డి సామాజిక వర్గం అన్నట్టు పరిస్థితి ఉండేది. అయితే ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఏదో ఒక రెండు సామాజిక వర్గాలు కలిస్తేనే భారీ విజయం నమోదు అయ్యేది. అయితే కాపు సామాజిక వర్గానికి ఇంతవరకు రాజ్యాధికారం దక్కలేదు. ఆ సామాజిక వర్గం నేత ముఖ్యమంత్రి పదవి చేపట్టలేదు. కానీ ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా కాపు సామాజిక వర్గం మద్దతు అవసరం. అందుకే రెడ్డి సామాజిక వర్గంతో కానీ.. కమ్మ సామాజిక వర్గంతో కానీ.. కాపు సామాజిక వర్గం తోడైతేనే విజయం సాధ్యమవుతుంది. అయితే ప్రతి ఎన్నికల్లోను తమ నిర్ణయాన్ని మార్చుకుంటూ వస్తోంది కాపు సామాజిక వర్గం. కానీ పవన్ కళ్యాణ్ రాకతో కాపు సామాజిక వర్గం ఆలోచన మారింది. మెజారిటీ వర్గం పవన్ వెంట నడిచింది.
కుల సంఘాల నేతలు పిలుపు..
2024 ఎన్నికల్లో టిడిపి కూటమి( TDP Alliance ) ఘన విజయం సాధించడం వెనుక కాపు సామాజిక వర్గం ఉంది. కమ్మ సామాజిక వర్గంతో సమన్వయంతో ముందుకు సాగింది కాపు సామాజిక వర్గం. అయితే ఇప్పుడు కాపు సామాజిక వర్గం కూటమి ప్రభుత్వంలో నష్టపోతోందన్న వాదనను ఆ కుల సంఘ నాయకులు వినిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ స్పందించాలని కోరుతున్నారు. కానీ ఆయన స్పందించే అవకాశం లేదు. కనీసం పట్టించుకోరు కూడా. సుమారు 15 ఏళ్ల పాటు కూటమి కొనసాగాలని కోరుతున్నారు. జనసేన శ్రేణులను సైతం అదే విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చారు. కింది స్థాయిలో సమస్యలు ఉంటే పరిష్కరించుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పుడు కూడా కాపు సంఘం నేతలు డిమాండ్లకు తలోగ్గితే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని తెలుసు. ఇది ఎంత మాత్రం శ్రేయస్కరం కాదన్న విషయంపై కూడా ఆయనకు పూర్తి అవగాహన ఉంది.