Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాన్ స్పీడు మామూలుగా లేదుగా

వాస్తవానికి పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవితో పాటు హోం మంత్రి పదవి దక్కుతుందని అంతా భావించారు. హోదా పరంగా సీఎం తర్వాత హోం శాఖ ఉండటంతో దానినే పట్టుబడతారని అంతా భావించారు.

Written By: Dharma, Updated On : June 20, 2024 1:13 pm

Deputy CM Pawan Kalyan

Follow us on

Deputy CM Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్ తొలిరోజు అధికారులను పరుగులెత్తించారు. దాదాపు పది గంటల పాటు నిరాటంకంగా సమీక్ష జరిపారు. అధికారులకు మూడు నెలల టార్గెట్ ఫిక్స్ చేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిరోజు.. తన క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖ అధికారులతో సమీక్ష జరిపారు. ఆయా శాఖల పనితీరును అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో రహదారులు, మౌలిక వసతులు, మంచినీటి కొరత సమస్యలపై యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారు. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తూ పవన్ కళ్యాణ్ తొలి సంతకం చేశారు. గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణ ఫైల్ పై రెండో సంతకం పెట్టారు.

వాస్తవానికి పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవితో పాటు హోం మంత్రి పదవి దక్కుతుందని అంతా భావించారు. హోదా పరంగా సీఎం తర్వాత హోం శాఖ ఉండటంతో దానినే పట్టుబడతారని అంతా భావించారు. కానీ పవన్ మనసులో గ్రామీణాభివృద్ధిపైనే ఎక్కువ ఆసక్తి ఉంది. అటవీ శాఖ అంటే పవన్ కళ్యాణ్ కు ఇంకా ఇష్టం. జనసేన సిద్ధాంతాల్లో పర్యావరణ పరిరక్షణ లక్ష్యం. అటువంటి పర్యావరణ శాఖను పవన్ కళ్యాణ్ కు కేటాయించారు. కీలకమైన నాలుగు శాఖలు తనకు నచ్చినవేనని.. కేటాయించిన సీఎం చంద్రబాబుకు పవన్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అయితే మొత్తం పల్లె పాలన అంతా పవన్ కళ్యాణ్ చేతిలో ఉంది. క్షణం తీరిక లేకుండా సమీక్షలు జరపాల్సి ఉంటుంది. ఒకవైపు సినిమాలు ఉండడంతో తన శాఖను ఎలా నిర్వహిస్తారు అని అందరిలోనూ ఒక రకమైన ఉత్కంఠ ఉంది. కేవలం ఆసక్తి అని కాకుండా.. గ్రామీణాభివృద్ధికి పవన్ కళ్యాణ్ ఎలా పరితపిస్తున్నారో ఆయన రంగంలోకి దిగిన తర్వాత తెలుస్తోంది.ఒకటి కాదు రెండు కాదు ఏకధాటిగా 10 గంటల పాటు అధికారులతో సమీక్షలు జరపడం విశేషం.

పవన్ కళ్యాణ్ పవర్ పాలిటిక్స్ చేయడం ఇదే మొదటిసారి. తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రి అయ్యారు. డిప్యూటీ సీఎం పోస్టును దక్కించుకున్నారు. ఎటువంటి అనుభవం లేకపోవడంతో పవన్ ఎలా ముందుకెళ్తారు అన్నది ఒక ప్రశ్నగా ఉంది. కానీ పవన్ పనితీరు చూస్తుంటే పాలనలో ఎంతో అనుభవం ఉన్నట్టు కనిపిస్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ సినిమాల్లో బిజీగా ఉండడంతో ఆయన డిప్యూటీ సీఎం తో పాటు సినిమాటోగ్రఫీ మినిస్టర్ పదవి తీసుకుంటారని అంతా భావించారు. కానీ అందుకు భిన్నంగా.. చేతినిండా పని ఉండే గ్రామీణ శాఖలను తీసుకోవడం సర్వత్రా ఆసక్తిగా మారింది. మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక ఆయన చేసిన సమీక్షలు చూసి అధికారుల సైతం కంగారు పడిపోయారు. తప్పకుండా ఆ నాలుగు శాఖలపై పవన్ ముద్ర చూపడం ఖాయమని అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా అటవీ శాఖలో ఉన్న లోటుపాట్లు, అవకతవకలను పవన్ అధిగమించే అవకాశం ఉంది. ముఖ్యంగా అడవి తల్లిని నాశనం చేస్తున్న వారిని విడిచి పెట్టనని పవన్ కళ్యాణ్ హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇటు గ్రామీణ అభివృద్ధి పై దృష్టి పెడుతూనే అడవుల సంరక్షణకు పవన్ తన మార్కు నిర్ణయాలు తీసుకుంటారని అంచనాలు ఉన్నాయి. మరి అందులో ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి.