AP Assembly Session: ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. చంద్రబాబుతో పాటు మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. పదవీ బాధ్యతలు చేపట్టారు. రేపు ఎమ్మెల్యేలు సైతం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేపటి నుంచి రెండు రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతాయి. ఇప్పటికే ప్రొటెమ్ స్పీకర్ గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి నియమితులయ్యారు. ఆయనతో నేడు గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. రేపు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రులతో పాటు వైసిపి అధినేత జగన్, ఇతర ఎమ్మెల్యేలతో ప్రొటెమ్ స్పీకర్ గా వ్యవహరించే బుచ్చయ్య చౌదరి ప్రమాణస్వీకారం చేయించనున్నారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఏర్పాట్లను పూర్తి చేశారు అధికారులు. అయితే అసెంబ్లీకి జగన్ వస్తారా? రారా? అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి కేవలం 11 స్థానాలే దక్కాయి. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. గత అనుభవాల దృష్ట్యా అసెంబ్లీకి వస్తే అవమానకర ఘటనలు ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే జగన్ కచ్చితంగా అసెంబ్లీకి రారు అని ఒక అంచనా ఉంది. 2014లో టిడిపి అధికారంలో ఉన్నప్పుడు కూడా జగన్ అసెంబ్లీని బాయ్ కట్ చేశారు. ఆ పార్టీ సభ్యులు ఎవరు అసెంబ్లీకి హాజరు కాలేదు. అసెంబ్లీలో టిడిపి సభ్యుల నుంచి అవమానాలు ఎదురు కావడంతో అప్పట్లో ఆ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు కూడా హౌస్ లో తనకు వ్యతిరేకంగా 166 మంది సభ్యులు ఉండనున్నారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో.. హౌస్ లో ముప్పేట దాడి ఉంటుంది. ఈ విషయం జగన్ కు తెలియంది కాదు. పైగా గత ఐదు సంవత్సరాలుగా చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఎన్ని రకాల అవమానాలు ఎదుర్కొన్నారో జగన్ కు తెలియంది కాదు. అందుకే ఆయన వీలైనంతవరకు అసెంబ్లీలో అడుగు పెట్టరని ప్రచారం జరిగింది. కానీ మారిన పరిస్థితులకు అనుగుణంగా, అనుభవజ్ఞుల సలహా మేరకు.. ఆయన తప్పకుండా అసెంబ్లీలో అడుగు పెడతారని తెలుస్తోంది.
గతంలో మాదిరిగా అసెంబ్లీని బాయ్ కట్ చేసి.. ప్రజల్లోకి బలంగా వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కానీ మేధావులు, సలహాదారులను సంప్రదిస్తే.. అధికార పక్షం నుంచి తప్పకుండా దాడి ప్రారంభమవుతుందని.. ప్రజాక్షేత్రంలోని ఇబ్బందులు వస్తాయని.. దానికంటే అసెంబ్లీలో అడుగుపెట్టడం మేలన్న సూచనలు వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే జగన్ తన మనసును మార్చుకున్నారని..22న జరగాల్సిన విస్తృత స్థాయి సమావేశాన్ని 20వ తేదీన నిర్వహించేందుకు నిర్ణయించుకున్నట్లు వైసిపి వర్గాలు చెబుతున్నాయి. అటు బుధవారం పులివెందుల వెళ్లాల్సిన జగన్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే జగన్ అసెంబ్లీలో అడుగు పెడతారని అంతా ఒక అంచనాకు వస్తున్నారు. అయితే ఆయన వస్తారా? రారా? అన్నది రేపటికి తెలుస్తుంది.