Pawankalyan : పెద్దిరెడ్డి పై పదివేల కోట్ల బాంబు పేల్చిన పవన్ కళ్యాణ్

అదే రూ.10 వేల కోట్టతో పరిశ్రమలు పెట్టి నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించవచ్చన్నారు. పెద్దిరెడ్డి అవినీతిని ప్రస్తావించేసరికి సభికుల నుంచి హర్షధ్వానాలు వ్యక్తమయ్యాయి.

Written By: Dharma, Updated On : June 17, 2023 9:22 am
Follow us on

Pawankalyan : జనసేనాని పవన్ దూకుడు పెంచుతున్నారు. వారాహి యాత్రలో విమర్శల జడివానతో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు. ఈ నెల 14న అన్నవరం సత్యదేవుడి సన్నిధి నుంచి వారాహి యాత్ర ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఉభయ గోదావరి జిల్లాల్లో 11 నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగనుంది. ఇప్పటికే యాత్ర జనసంద్రంగా మారుతోంది. బహిరంగ సభలు జనాలతో కిక్కిరిసిపోతున్నాయి. దీంతో పవన్ తనదైన శైలిలో ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. మూడో రోజు యాత్రలో భాగంగా పిఠాపురంలో జరిగిన సభలో పవన్ చిత్తూరు జిల్లా వైసీపీ నేతల ఆగడాలపై ఫైర్ అయ్యారు.

తిరుమల తిరుపతి దేవస్థానంలో వైసీపీ నేతలు ఎన్నో అక్రమాలకు పాల్పడుతున్నట్టు పవన్ ఆరోపించారు. శ్రీవాణి ట్రస్ట్ పేరుతో నిధులు మళ్లిస్తున్నారని చెప్పుకొచ్చారు. కలియుగ ధైవంతో ఆటలాడుతున్నారని.. దానికి తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 219 ఆలయాలపై దాడులు జరిగితే ఒక్కరంటే.. ఒక్క నిందితుడ్ని పట్టుకోలేని స్థితిలో జగన్ సర్కారు ఉందని చెప్పారు. రాష్ట్రంలో హిందు దేవాలయాల రక్షణ కరువవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

ల్యాండ్, శాండ్, ఎర్రచందనం, పాడిరైతుల మోసాలు, మామిడి రైతుల నిలువు దోపిడీకి చిత్తూరు కేంద్రంగా నిలుస్తుందని పవన్ ఆరోపించారు. అక్కడ వైసీపీ నేతల అవినీతికి అడ్డూ అదుపూ లేకుండా పోతుందన్నారు. ఇక్కడ నుంచే రాయలసీమను రిమోట్ చేస్తున్నారని..వ్యవస్థలను సైతం నీరుగార్చుతున్నారని పవన్ ఆరోపణలు చేశారు. వైసీపీ నేత దాష్టీకాలకు అడ్డే లేకుండా పోతోందని..,వారికి సీఎం అండదండలు పుష్కలంగా ఉన్నాయని విమర్శించారు.

చిత్తూరు జిల్లాలో వైసీపీకి మెయిన్ పిల్లర్స్ ఉన్నాయని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి పవన్ ప్రస్తావించారు. ఇక్కడ దెబ్బకొడితే రాయలసీమ మొత్తం వైసీపీ పతనం అవుతుందని జోస్యం చెప్పారు. ఇసుక కాంట్రాక్ట్ తీసుకొని పెద్దిరెడ్డి రూ.10 వేల కోట్లు దోచేస్తున్నాడంటూ ఆరోపించారు. అదే రూ.10 వేల కోట్టతో పరిశ్రమలు పెట్టి నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించవచ్చన్నారు. పెద్దిరెడ్డి అవినీతిని ప్రస్తావించేసరికి సభికుల నుంచి హర్షధ్వానాలు వ్యక్తమయ్యాయి.